సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతిలో తెలంగాణ
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
గుల్లకోటలో 2కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
వెల్గటూర్, జనవరి 31: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తున్నదని, మన పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 70 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడేండ్లలోనే చేసి చూపించారని ప్రశంసించారు. సోమవారం వెల్గటూర్ మండలం గుల్లకోటలో రూ.2 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారందరికీ మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషిచేస్తున్నారని కొనియాడారు. అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. రైతు బంధుతో పంటకు పెట్టుబడి సాయం ఇస్తూ భరోసాగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గుల్లకోటలోనే నాలుగేండ్లలో ఎనిమిది విడుతల్లో 3,338 మంది రైతుల ఖాతాల్లో 20.43 కోట్లు జమ చేశారని, ఇలా రాష్ట్రంలో ని రైతులకు 50 వేల కోట్లు పెట్టుబడి సాయంగా అందజేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి దేశంలోని ప్రతిపక్షాలు మెచ్చుకుంటుంటే అది చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నదని, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇక గ్రామాల్లోని రైతు వేదికలు రైతులకు అధ్యయన, విజ్ఞాన కేంద్రాలుగా సేవలందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నదని, పట్టణాలకు దీటుగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తూ, గ్రామాల్లో నిత్యం పారిశుధ్య పనులు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మంత్రి కార్మిక శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ-శ్రమ్ కార్డులు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై ప్రజలందరిలో అవగాహన పెంపొందించేందుకు పార్టీ కార్యకర్తలు ముందుండి పని చేయాలని పిలుపు నిచ్చారు. 200 మందికి లేబర్ ఇన్సూరెన్స్, ఈ-శ్రమ్ కార్డులను అందజేశారు. మండల కేంద్రానికి చెందిన చెన్న రాజమౌళి రోడ్డు ప్రమాదంలో గాయపడి, మూడేళ్ల నుంచి మంచానికే పరిమితం కాగా, ఆయనను పరామర్శించి తగిన సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, సర్పంచ్ పోన్నం స్వరూపాతిరుపతి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ శంకర్రావు, ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రియాజ్, ఎంపీటీసీ శ్రీజ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, ప్రధాన కార్యదర్శి జుపాక కుమార్, ఉపాధ్యక్షుడు గుండా జగదీశ్వర్ గౌడ్, యూత్ అధ్యక్షుడు బిడారి తిరుపతి, ప్రధానకార్యదర్శి గొల్లపల్లి రాజు, మహిళా అధ్యక్షురాలు కోమటిరెడ్డి సింధూజారెడ్డి, నాయకులు పదిరే నారాయణరావు, రామడుగు రాజేశ్, రజక సంఘ నాయకులు లింగంపల్లి చందు, పాపయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు వనం రమణయ్య, లచ్చయ్య, చుంచు మల్లేశ్, పడిదం వెంకటేశ్, గాదం భాస్కర్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.