మొసలి కన్నీళ్లను నమ్మొద్దు
పదవిలో ఉండి చేయని వ్యక్తి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏంచేస్తడు
ఆయన స్వార్థంతోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక
కేసీఆర్ సంపద సృష్టిస్తుంటే బీజేపీ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతోంది
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు
హుజూరాబాద్, సెప్టెంబర్ 9:“తన ఆస్తులు కాపాడుకునేందుకు రాజీనామా చేసి, తానేదో ప్రజల కోసం పదవి వదులుకున్నట్లు బీజేపీ నేత ఈటల రాజేందర్ ఢాంబికాలు పలుకుతున్నాడు.. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనాలు కావాలా? ఆ వ్యక్తికి ప్రయోజనం చేకూరాలా? తేల్చాల్సింది మీరే” అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హుజూరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. మొసలి కన్నీళ్లను నమ్మొద్దని, పదవిలో ఉండి చేయని వ్యక్తి ప్రతిపక్షంలో ఉండి ఏంచేస్తాడని ప్రశ్నించారు. ఎవరికి ఓటేస్తే లాభమో ఆలోచించాలని సూచించారు. గురువారం హుజూరాబాద్ పట్టణ సమీపంలో రంగనాయకులగుట్ట వద్ద పెద్దమ్మగుడి నిర్మాణానికి మరో మంత్రి గంగులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం సింగాపూర్‌లో బ్రాహ్మణ పరిషత్ బెస్ట్ సీమ్ కింద 60 శాతం సబ్సిడీతో మంజూరైన టాక్సీ వాహనాన్ని ప్రారంభించారు. సాయంత్రం ప్రతాప సాయిగార్డెన్‌లో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ప్రసంగించారు.
ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే కేంద్ర ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని, ఉన్న నౌకరీలు ఊడగొడుతున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆక్షేపించారు. ఇప్పటికే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, విమానయాన, విశాఖ ఉక్కు తదితర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉన్న నౌకర్లను ఊడగొట్టింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. గురువారం పట్టణంలోని ప్రతాప సాయిగార్డెన్‌లో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను అమ్ముతుంటే కేసీఆర్ కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి సంపదను సృష్టిస్తున్నారని, ఆస్తులు అమ్మేవాళ్లు కావాలా..? సంపద సృష్టించేవాళ్లు కావాలా..? ఆలోచించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేత ఈటల మొసలి కన్నీరు కారుస్తూ వస్తున్నాడని, సానుభూతి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మంత్రిగా ఉండి ఏమి చేయని వ్యక్తి.. రేపు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. విశ్వకర్మల బాగోగుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్లో ఉన్నపుడు బీజేపీని విమర్శించిన ఈటల, ఇప్పుడు అదే పార్టీలో చేరి ప్రజలకు ఏం సంకేతం ఇచ్చాడో చెప్పాలన్నారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నియోజకవర్గంలో కనీసం రూ.10లక్షల అభివృద్ధి పనులు చేయలేదని, ఈటల పరిస్థితి అలాగే ఉంటుందని చెప్పారు. గులాబీ జెండా పార్టీ పెట్టాలని కేసీఆర్ ఆలోచన ప్రారంభమైనప్పుడు ఉన్న తొలి వ్యక్తుల్లో మధుసూదనాచారి ఒకరు అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ తొలి స్పీకర్‌గా కీర్తిని అందుకున్నాడన్నారు.
విశ్వబ్రాహ్మణులకు కృతజ్ఞతలు..
గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తామని ఏకగ్రీవంగా మద్దతు తెలిపినందుకు విశ్వబ్రాహ్మణులకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశ్వకర్మలపై పోలీసుల వేధింపుల్లేకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. వడ్రంగులకు కర్ర దొరకడం కష్టమైందని, దాన్ని సులభతరం చేసేందుకు కృషి చేస్తానన్నారు. విశ్వకర్మ కార్పొరేషన్ నిధులు ఇచ్చి బలోపేతం చేస్తామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్ని ఒక వ్యక్తి స్వార్థంతో వచ్చిందని, దీనిపై ఆలోచన చేసి టీఆర్ఎస్ గెలిస్తే లాభం జరుగుతుందో, బీజేపీ గెలిస్తే ఏమి జరుగుతుందో ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితుల్లేవన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంలో విశ్వబ్రహ్మణులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్‌కు తప్పకుండా రాజకీయ భవిష్యత్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ రాజకీయ చరిత్ర మరోసారి పునరావృతం కాబోతుందని, 2004లో కమలాపూర్ నియోజకవర్గంలో దామోదర్‌రెడ్డిపై ఈటల ఎలా గెలిచారో.. అతనిపై ఇపుడు గెల్లు శ్రీనివాస్ కూడా ఘనవిజయం సాధించి చరిత్ర తిరగరాస్తారన్నారు. ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే అభివృద్ధి పనులకు ఢోకా ఉండదన్నారు. విశ్వబ్రహ్మణుల కమ్యూనిటీ భవనానికి ఈ నెల 16న భూమిపూజ చేసుకోబోతున్నామని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విశ్వబ్రహ్మణులు హాజరై తమ తడాఖా చూపించాలని కోరారు.
గెల్లు గెలుపు బాధ్యత తీసుకోవాలి : మధుసూదనాచారిఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించే బాధ్యత ప్రతి విశ్వబ్రహ్మణుడు తీసుకోవాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. విశ్వబ్రహ్మణుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమని, ఎన్ని జన్మలైనా మరల ఇదే కులంలో పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానన్నారు. కేసీఆర్ పెద్ద మనసుతో తెలంగాణ తొలి స్పీకర్‌గా నియమించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, మరిచిపోలేనన్నారు. విశ్వబ్రహ్మణులంతా ఉప ఎన్నికల్లో పట్టుదలతో పని చేసి గెల్లు శ్రీనివాస్ గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, విశ్వబ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి, నాయకులు వేణుగోపాలచారి, వెంకటేశ్వరచారి, భాస్కరచారి, ముంజంపెల్లి శ్రీనివాస్, సురచారి, తాటికొండ రామూర్తి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కరెంటు సమస్య తీర్చిన దేవుడు కేసీఆర్..
ఏడేళ్ల కిందటి వరకు కరెంటు సమస్య గురించి చెప్పనవసరం లేదు. ఎందరో సీఎంలు, ప్రభుత్వాలు వచ్చిపోయినా కరెంటు సమస్య తీర్చలేదు. 30ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు కరెంటు బాధలు నాకు తెలుసు. ట్రాన్స్ఫార్మర్ మంచిగా ఉంటే మోటరు కాలిపోతది. మోటరు మంచిగా ఉంటే ట్రాన్స్ఫార్మర్ బుగ్గి అవుతుంది. ఈ రెండు మంచిగా ఉంటే కరెంటు ఉండదు. కరెంటు సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే కరెంటు సమస్య తీర్చిన దేవుడు కేసీఆర్. ఆయన కలకాలం చల్లగా ఉండాలి.
గెల్లు గెలుపు ఎప్పుడో ఖరారైంది..
గెల్లు శ్రీనివాస్ గెలుపు ఎప్పుడో ఖరారైంది. ఆయన మెజార్టీ కోసం విశ్వబ్రహ్మణులంతా కలిసి పని చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభ స్పీకర్ పదవిని విశ్వబ్రహ్మణులకు ఇచ్చిన గొప్ప మహానుభావుడు కేసీఆర్. రాజకీయంగా ఈటల రాజేందర్ ఇక్కడి వాళ్లను ఎదగనియ్యలేదు. ఉప ఎన్నికలో విశ్వబ్రహ్మణులంతా తమ ప్రతాపాన్ని చూపించి టీఆర్ఎస్కు భారీ మెజార్టీని వచ్చేందుకు కృషి చేయాలి.
టీఆర్ఎస్కే తమ మద్దతు..
ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మా మద్దతు ఉంటుంది. పేదల కోసం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నాడు. గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసేందుకు విశ్వబ్రహ్మణులంతా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాం. నియోజకవర్గంలోని విశ్వబ్రహ్మణులందరిని ఏకతాటిపైకి తీసుకువస్తాం. పట్టణంలో విశ్వబ్రహ్మణుల కమ్యూనిటీ హాల్ కోసం ఎకరం స్థలం, నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.