జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రశంస
‘వాష్’ వర్చువల్ సదస్సులో కార్యక్రమాలను వివరించిన కలెక్టర్
కొనియాడిన సదస్సు సమన్వయకర్త
స్ఫూర్తినిచ్చిన ‘పల్లె ప్రగతి’
కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి స్ఫూర్తిగా కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలకు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, యూ నిసెఫ్ ఆధ్వర్యంలో బుధవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన వాటర్ శానిటేషన్ అండ్ హైజనీ (డబ్ల్యూఏఎస్‌హెచ్ -వాష్) సదస్సులో జాతీయ స్థాయిలో ఒక్క కరీంనగర్ జిల్లాకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈ సదస్సులో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ఓడీఎఫ్ (బహిరంగ మల విసర్జనరహిత) జిల్లాగా 2017లో కరీంనగర్‌ను ప్రకటించారని చెప్పారు. తర్వాత దీనిని సుస్థిరపర్చడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో జిల్లా ముందు వరుసలో ఉందని వివరించారు. పల్లె ప్రగతి స్ఫూర్తిగా చెత్త బుట్టల వినియోగం, చెత్త రవాణా, ప్రతి గ్రామంలో కంపోస్టు షెడ్ల ఏర్పాటు, నిర్వహణ, తడి పొడి చెత్తను వేరుచేయడం, చెత్త నుంచి సంపద తయా రు చేయడం, ప్రతి గ్రామంలో ట్రాక్టర్ వినియోగం వంటి అంశాలను ఈ సదస్సు లో కలెక్టర్ కర్ణన్ వివరించారు. అంతే కాకుండా వైకుంఠధామాలు, నర్సరీ మొక్కల పెంపకం తదితర విషయాలను కూడా వివరించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 అనుసరించి పంచాయతీ స్థాయిలో సక్రమ పాలన, పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం ఒక బాధ్యతగా అప్పగించడమే కాకుండా నిర్లక్ష్యం వహించిన పంచాయతీలపై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టంలో కల్పించారని వివరించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ సదస్సుకు సమన్వయకర్తగా ఉన్న నికోలస్ అస్బెర్ట్ స్పందిస్తూ జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛత సుస్థిరత కార్యక్ర మాలను ప్రశంసించారు. జాతీయ స్థాయిలో సుమారు 2,700 మంది ప్రతినిధు లు ఈ వర్చువల్ ఆన్లైన్ సదస్సులో పాల్గొన్నారని, వీరందరికీ కరీంనగర్ జిల్లా స్ఫూర్తిగా నిలుస్తున్నదని కొనియాడారు. ఈ సందర్భంగా యూనిసెఫ్, ఎన్ఐఆర్డీ సరఫరా చేసిన ఓడీఎఫ్ పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ కర్ణన్, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో ఎల్ శ్రీలతా రెడ్డి, డీపీవో వీర బుచ్చయ్య, యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛ భారత్ సమన్వయకర్త రమేశ్, సిబ్బంది కల్యాణి, వెంకటేశ్, రవీందర్ ఉన్నారు.