సేవా తత్పరతను చాటుతున్న చల్మెడ కుటుంబం
గ్రామంలో కోటిన్నరతో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం
కార్పొరేటుకు దీటుగా డిజైన్ రూపకల్పన
నమూనాను మంత్రి కేటీఆర్‌కు అందించిన లక్ష్మీనరసింహారావు
కరీంనగర్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి చల్మెడ అనందరావు అందరికీ సుపరిచుతులే. వయస్సు 91 ఏళ్లు ఉన్నా.. సేవ చేయాలన్న సంకల్పం మాత్రం అతనిలో సడలడంలేదు. వీరి సొంత గ్రామమైన మల్కపేటలో తండ్రి ఆనందరావుతో కలిసి తనయుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు ఎన్నో స్వచ్ఛం ద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడంతోపాటు.. ఈ ఇందుకు కావాల్సిన బిల్డింగ్‌ను సొంత నిధులతో నిర్మించి ఇచ్చారు. చల్మెడ లక్ష్మీనరసింహారావు.. కేపీవీ రాంచందర్‌రావుతో ఉన్న సాన్నిహిత్యంతో.. అతని ఎంపీ నిధుల నుంచి గతంలో రూ.80 లక్షల గ్రాంటు తెచ్చి గ్రామంలో సీసీ రోడ్లను నిర్మించారు. చల్మెడ వైద్య విజాన సంస్థ నుంచి ఎన్నోసార్లు మల్కపేటలోనే కాదు.. కోనరావుపేట మండల వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యపరమైన సేవలందిస్తున్నారు. ఇవేకాదు.. గ్రామంలోని చాలా మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకోవడంలో ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. ఇప్పుడు ఇదే గ్రామంలో ఆనందరావు తల్లి జానకీ దేవి స్మారకార్థం ఆధునిక హంగులతో ప్రాథమిక పాఠశాలను నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.కోటిన్నర వ్యయం అవుతున్నా వెనుకాడకుండా కార్పొరేటుగా దీటుగా.. పక్కా ప్రణాళికతో ఈ భవనం నిర్మిస్తుండగా.. ఈ భవనానికి సంబంధించిన నమూనాను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు శనివారం చల్మెడ లక్ష్మీనరసింహరావు అందించారు. ‘మన ఊరు-మన బడి’ ప్రణాళికలో భాగంగా.. పాఠశాల భవనాల నిర్మాణాలు, ఇతర కార్యక్రమాలు చేపట్టడానికి సర్కారుబడులకు చేయూత నిచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.కోటిన్నరతో పాఠశాల భవన నిర్మాణానికి చల్మెడ కుటుంబసభ్యులు ముందుకు రావడాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. సాధ్యమైనంత తొందగా భవనం పూర్తిచేసి.. ప్రభుత్వానికి అందిస్తామని ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహరావు కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.