స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక చేయూత
లక్షలు ఖర్చు చేసి గ్రంథాలయాలు, ల్యాబ్‌ల ఏర్పాటు
నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ
ఆదర్శంగా నిలుస్తున్న మంథనికి చెందిన గట్టు నారాయణ గురూజీ
మంథని టౌన్, ఫిబ్రవరి 15 : సామాజిక సేవే పరమావధిగా మంథనికి చెందిన గట్టు నారాయణ గురూజీ 2003 సంవత్సరంలో తన తల్లిదండ్రుల స్మారకార్థం శ్రీ సీతారామ సేవా సదన్‌ను స్థాపించారు. వ్యాపారవేత్తగా, దేశంలోని పలు కంపెనీలకు సలహాదారుడిగా పనిచేస్తున్న ఆయన ఈ సంస్థ ద్వారా మాతృభూమికి సేవ చేయాలని సంకల్పించారు. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులకు ఆర్థిక చేయూతనందిస్తున్నారు. మొక్కలు నాటి సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా సర్కారు స్కూళ్ల పునర్జీవానికి ఉపక్రమించారు. మౌలిక వసతుల కల్పనకు విరివిగా ఖర్చు పెడుతున్నారు. పలు పాఠశాలల్లో గ్రంథాలయాలు, సైన్స్‌ల్యాబ్‌లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. చదువులో ముందుండే నిరుపేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కుర్చీలు, బెంచీలను వితరణ చేశారు. సురక్షితమైన తాగునీరందించేందుకు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు చేశారు. యేటా పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ విద్యా బోధన కోసం సెటప్ బాక్స్‌లను సైతం సమకూరుస్తున్నారు.
స్కూళ్లల్లో చేపట్టిన కార్యక్రమాలు..
ఆరెంద జడ్పీ స్కూల్లో ఐదేండ్ల క్రితం మూడు తరగతి గదుల నిర్మించారు. మంథని గర్ల్స్ హైస్కూల్లో 50వేలతో మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు 25 వేలతో బోర్వెల్కు మరమ్మతు చేపట్టారు. మంథని డిగ్రీ కళాశాలలోని లైబ్రరీకి 3 బీరువాల ఇచ్చారు. 1.25లక్షలతో ఆర్వో ప్లాం ట్ ఏర్పాటు చేశారు. మంథని జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్, ప్రభుత్వ బాలుర పాఠశాల, చందనాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల చొప్పున వెచ్చించి మూడు సైన్స్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేశారు. మంథనిలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలకు 2 లక్షల విలువ చేసే ప్రొజెక్టర్ అందజేశారు. వెంకటాపూర్‌లో జ్యోతిరావుఫూలే హైస్కూల్‌కు 20 వేల విలువైన రిఫ్రిజిరేటర్ అందించారు. మంథని ప్రభుత్వ పాఠశాలలో అభ్యసిస్తున్న మారుమూల ప్రాంతాలైన పంకెన, పల్మెల, లెంకలగడ్డలకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల కోసం 30వేల విలువైన 20 సెటప్ బాక్సులు పంపిణీ చేశారు.
స్కాలర్ షిప్‌లు అందజేత..
ప్రతి ఏడాది 1 నుంచి 10వ తరగతిలో ఇంగ్లిష్, తెలుగు మీడియాల్లో ఫస్ట్ టాపర్‌కు రూ. 1500, సెకండ్ టాపర్‌కు రూ. 1000 చొప్పున స్కాలర్ షిప్‌లు అందిస్తున్నారు. మండలంలోని 67 ప్రభుత్వ పాఠశాలలకు యేటా 8000 నోట్ పుస్తకాలు, ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. బాల్ బాడ్మింటన్‌లో ప్రతిభ చూపుతున్న మంథనికి చెందిన కేయూర అనే క్రీడాకారిణికి రెండేళ్లపాటు ఆర్థిక సాయం అందించారు.
విద్యార్థుల భవిష్యత్ కోసమే..
పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసమే సేవా సదన్ ద్వారా గట్టు నారాయణ గురూజీ స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చేందుకు తాము సహకరిస్తున్నాం. భవిష్యత్‌లోనూ కొనసాగిస్తాం.
– కర్నె హరిబాబు, అధ్యక్షుడు, సేవా సదన్, మంథని.
గురూజీ ఆశయ సాధనకు కృషి..
మానవ సేవే మాధన సేవ.. విద్యాదానం మహా దానం అనే సంకల్పాన్ని నమ్మిన సదన్ వ్యవస్థాపకులు నారాయణ గురూజీ ఆశయాలకు అనుగుణంగానే సేవా సదన్ పనిచేస్తున్నది. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే సంస్థ లక్ష్యం. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు యేటా స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నాం.
– దుద్దిళ్ల గణపతి, కార్యదర్శి, సేవా సదన్, మంథని.