కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 24: రేకుర్తి, చింతకుంటలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన హుండీలను గురువారం లెక్కించారు. రేకుర్తి జాతరలో ఏర్పాటు చేసిన 20 హుండీలను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో భద్రపర్చి జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో జాతర వ్యవస్థాపక చైర్మన్, దేవాదాయశాఖ ఏసీ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో లెక్కించారు. ఇందులో హుండీల ద్వారా రూ. 25,29,128 నగదు, వెండి 1100 గ్రాములు, బంగారం 15 గ్రాములు రాగా, టికెట్ల ద్వారా రూ. 5,07,820, వివిధ వేలంల ద్వారా రూ. 11, 22,000 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ డీసీ త్రయంబకేశ్వర్, జాతర ప్రత్యేకాధికారి ఎండపల్లి మారుతి, దేవాదాయశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ఎన్ సుప్రియ, ఈవో రత్నాకర్ రెడ్డి, గోవిందపతి శ్రీవారి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అలాగే, చింతకుంట జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను దేవాదాయశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ఎన్ సుప్రియ, ఈవో అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో లెక్కించారు. ఆదాయం రూ. 1,09,562 వచ్చినట్లు అధికారులు తెలిపారు.
హుండీ లెక్కింపు పర్యవేక్షణ
రేకుర్తి సమ్మక్క జాతర హుండీ లెక్కింపును మేయర్ వై సునీల్ రావు పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే జాతర కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కెనాల్‌కు ఇరువైపులా ర్యాంపు, జాతర ప్రదేశం సమీపంలో ప్రజలకు ఉపయోగపడేలా షెడ్డు నిర్మిస్తామని చెప్పారు. జాతర సమయంలో అన్ని శాఖ అధికారులు, కార్పొరేటర్లు సమన్వయంతో పని చేశారని ప్రశంసించారు.