కార్పొరేషన్, అక్టోబర్ 10: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సఫాయిమిత్ర సురక్షా చాలెంజ్‌లో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే మానవ వ్యర్థాలను యంత్రాల ద్వారా తొలగించేలా చర్యలు తీసుకుంటుండడం, నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో ఈ చాలెంజ్‌లో బల్దియాకు మంచి ర్యాంకు వచ్చేందుకు దోహదపడుతున్నది. సఫాయి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాల మంజూరుకు సైతం నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.
ఆధునిక యంత్రాలతో క్లీనింగ్
సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్‌లో భాగంగా సెప్టిక్ ట్యాంక్‌లు, భూగర్భ డ్రైనేజీలను యంత్రాలతోనే శుభ్రం చేయాలని బల్దియా ఆదేశించింది. ఇప్పటికే భూగర్భ డ్రైనేజీల్లోని మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు వీలుగా జెట్టింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసి వినియోగిస్తుండగా… మురుగు కాలువల్లోని సిల్ట్‌ను తొలగించేందుకు డీసిల్టింగ్ యంత్రాన్ని వినియోగిస్తున్నారు. గతంలో నగరపాలక సంస్థలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు ఇష్టారాజ్యంగా ఉండేవి. కాగా, సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్‌లో భాగంగా నగరంలోని అన్ని సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల యజమానులతో మాట్లాడిన నగరపాలక సంస్థ వాటిపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 14420 ప్రవేశపెట్టింది. టోల్ ఫ్రీ నంబర్, సఫాయి మిత్ర సురక్షా గురించి ప్రజలకు వివరించేందుకు నగరపాలక సంస్థ డివిజన్ల వారీగా సదస్సులు నిర్వహించింది. టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించిన వారికి నిర్ణీత రుసుంతో వాహనాన్ని పంపి సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయిస్తున్నారు.
సఫాయిమిత్ర ఉద్యోగి యోజన ద్వారా రుణాలు
ఈ చాలెంజ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సఫాయిమిత్ర కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కేఎఫ్డీసీ) కింద సఫాయి కార్మికులు, వారి గ్రూపుల కింద మానవ వ్యర్థాలను తొలగించే యంత్రాలను కొనుగోలు చేసుకోవడానికి రుణాలు అందిస్తున్నది. ఈ పథకంలో రూ. 15 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. ఈ పథకంలో రుణాలు పొందాలంటే ఆయా కార్మికులు నగరపాలక సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అత్యధికంగా రూ. 3.25 లక్షల వరకు లబ్ధిదారులకు సబ్సిడీ అందించనున్నారు. ఈ రుణాలతో భూగర్భ డ్రైనేజీ క్లీనింగ్, సెప్టిక్‌ట్యాంక్ క్లీనర్ తదితర వాహనాల కొనుగోలుకు మాత్రమే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే 12 దరఖాస్తులను నగరపాలక సంస్థ ద్వారా పంపించగా నలుగురికి రుణాలు మంజూరైనట్లు వెల్లడించారు. మిగతా దరఖాస్తుదారులకు కూడా రుణాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సెప్టిక్ ట్యాంక్‌ల జియోట్యాగింగ్
నగరంలోని అన్ని సెప్టిక్ ట్యాంకుల జియోట్యాగింగ్ పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంకులను మూడేళ్లకోసారి పరిశుభ్రం చేసుకోవాలి. కాగా, ఈ విషయంలో పూర్తిస్థాయిలో బల్దియా నుంచి పర్యవేక్షణ చేసేందుకు వీలుగా నగరపాలక సంస్థలోని అన్ని ట్యాంకులను జియోట్యాగింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టిక్ ట్యాంకులను మూడేళ్లకోసారి శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జియోట్యాగింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తున్నదని అధికారవర్గాలు తెలిపారు. నగరంలో మానవ వ్యర్థాలను యంత్రాల ద్వారా తొలగిస్తున్నట్లు బల్దియా అధికారులు తెలిపారు.