కరీంనగర్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : జనహృదయనేత ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌డే వేడుకలు ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నాయి. 68వ బర్త్‌డే సందర్భంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాయి. సర్వమత ప్రార్థనలు చేశాయి. సమ్మక్కకు ఎత్తు బంగారం జోకించి, పంచి పెట్టాయి. కేకులు కోస్తూ.. మిఠాయిలు పంచాయి. ‘శతమానం భవతి’ అంటూ దీవించాయి.
వినోద్‌కుమార్ పూజలు
తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మానసిక వికలాంగుల పాఠశాలలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్లతో కలిసి కేకు కోసి, విద్యార్థులకు పండ్లు అందజేశారు. ఎల్‌ఎండీకాలనీలో టీఎన్జీవో జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కేకు కోసి సంబురాలు జరుపుకున్నారు.
68 కిలోల బంగారం తూకం
టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో రేకుర్తిలోని సమ్మక సారలమ్మ జాతర వద్ద సీఎం కేసీఆర్ బం గారం 68 కిలోలు తూకం వేయించారు. మేయర్ వై సునీల్‌రావు, డిప్యూ టీ మేయర్ చల్ల స్వరూపరాణి హాజరై, బంగారాన్ని అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లి సమర్పించారు. అనంతరం 68 కొబ్బరికాయలు కొట్టారు.
జాతర భక్తులకు కోళ్లు పంపిణీ
బర్త్‌డే సందర్భంగా కరీంనగర్‌లోని 25వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్ ఆధ్వర్యంలో, కార్పొరేటర్ బొనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సమ్మక్క జాతరకు వెళ్తున్న భక్తులకు మేయర్ వై సునీల్‌రావు చేతుల మీదుగా వేర్వేరుగా కోళ్లను పంపిణీ చేశారు.
68 కిలోల భారీ కేక్
కరీంనగరంలోని తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 68 కిలోల కేక్‌ను ఏర్పాటు చేయగా, మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ హాజరై, కట్ చేశారు. స్వీట్లు మొక్కలూ పంపిణీ చేశారు.
హుజూరాబాద్, ఇల్లందకుంటలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజ య, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక పాల్గొన్నారు.
చొప్పదండిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. గంగాధర మండలం కొండన్నపల్లిలోని సహస్ర లింగేశ్వరాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.