భక్తులకు ఇబ్బంది కలుగకుండా సర్వీసులు
14 ఉచిత మినీ బస్సులు
కరీంనగర్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్
వేములవాడ రూరల్, ఫిబ్రవరి 24 : వేములవాడ మహాశివరాత్రి జాతరకు 770 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు నిర్వహించే జాతరకు దాదాపు 40 వేల మంది భక్తులు ఆర్టీసీ ద్వారా వస్తారని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసీ సిబ్బంది సహకారం అందిస్తారని చెప్పారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు దేవస్థానం సహకారంతో 14 మినీ బస్సులను నడుపుతామని, అవి 24 గంటలపాటు భక్తులకు ఉచిత సేవలను అందిస్తాయన్నారు. భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్‌లు ధరించి బస్సులు ఎక్కాలని సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ బస్టాండ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తుల కోసం 770 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామన్నారు. వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, నర్సంపేట, కామారెడ్డి వెళ్లే బస్సులు వేములవాడ తిప్పాపూర్ బస్ స్టేషన్ నుంచి వెళ్తాయన్నారు. జగిత్యాల, కొండగట్టు, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిర్మల్ వెళ్లే బస్సులు వేములవాడ కట్టకింద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్ స్టేషన్ నుంచి నడుస్తాయని చెప్పారు. వేములవాడ డిపో మేనేజర్ భూపతిరెడ్డి సహకారంతో మహాశివరాత్రి జాతరను విజయవంతం చేసేందుకు ఆర్టీసీ సిబ్బంది సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డివిజనల్ మేనేజర్ రవిశంకర్‌రెడ్డి, వేములవాడ డిపో మేనేజర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు.