జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు
సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల తనిఖీ
పేద విద్యార్థికి సామగ్రి అందజేత
కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 11: ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని, పేదరికం వారికి అడ్డంకి కాకూడదని జిల్లా విద్యాధికారి సీహెచ్ వీఎస్ జనార్దన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ రోడ్డు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి అరవింద్ తరగతిగదిలో స్పందించిన తీరుకు ఆయన అబ్బురపడ్డారు. ప్రతి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన అరవింద్ అందరికీ ఆదర్శంగా నిలుస్తాడని చెప్పారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి విద్యార్థులుంటారని, ఉపాధ్యాయులు గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. అరవింద్ పేదరికాన్ని చూసిన ఆయన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన సూల్ బ్యాగ్, సాక్స్, షూస్, నోట్ పుస్తకాలు, స్టేషనరీ అందించారు.
ఇదే సూల్ కాంపౌండ్‌లోని సుభాష్‌నగర్ హైసూల్లో అరవింద్ అక సరస్వతి ఆరో తరగతి చదువుతున్నది. ఆమె కిడ్నీ వాపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసి తల్లిదండ్రులను పిలిపించారు. జిల్లా వైద్యాధికారితో మాట్లాడి సరస్వతికి ప్రభుత్వ సివిల్ దవాఖానలో సీటీ సాన్, ఇతర పరీక్షలు చేయించారు. అనంతరం నగునూర్ పాఠశాలకు చెందిన విద్యార్థి బీ మౌనిక జాతీయ ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికవగా ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, గైడ్ టీచర్ అరుణను సుభాషనగర్ పాఠశాలకు పిలిపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండల విద్యాధికారి మధుసూదనాచారి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీరెడ్డి, ఉపాధ్యాయులు భారతి, కటకం రమేశ్, మాధవీలత, శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, బలరాం శారద తదితరులు పాల్గొన్నారు.
డీఈవోకు వినతిపత్రం అందజేత
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులకు విధులు కేటాయించాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి వేణుగోపాల్ ఆధ్వర్యంలో డీఈవోకు వినతిపత్రం అందజేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులుండి ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై డీఈవో సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.