గద్దెపై కొలువుదీరిన సారలమ్మ
జిల్లాలో మొదలైన భక్తుల మొక్కులు
నేడు గద్దెపైకి రానున్న సమ్మక్క
కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 16: వనదేవతల జాతర మొదలైంది. జాతరలో మొదటి రోజు బుధవారం సాయంత్రం సారలమ్మను కోయ పూజారులు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో కరీంనగర్‌లోని రేకుర్తి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి మొదలవగా, మున్సిపల్ అధికారులు, పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో భక్తులు బంగారం, ఎదురు కోళ్లు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఏర్పాట్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కోయ పూజారులు డప్పుచప్పుళ్ల మధ్య సారలమ్మను గద్దె వద్దకు తీసుకువచ్చి పూజలు చేసి ప్రతిష్ఠించారు. కాగా, జాతరలో భాగంగా గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెపైకి తీసుకువస్తారు. ఇప్పటికే జాతర ప్రాంతం జనంతో కిక్కిరిసి పోయింది. సమ్మక్క గద్దెపైకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
చొప్పదండి, ఫిబ్రవరి 16: మండలంలోని చొప్పదండి, రాగంపేట, ఆర్నకొండ, గుమ్లాపూర్ గ్రామాల్లో సారలమ్మను కోయ పూజారులు వనం నుంచి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో వివిధ కులసంఘాల నాయకులు, జాతర కమిటీ నిర్వాహకులు, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, ఫిబ్రవరి 16: మండలంలోని గోపాల్రావుపేట, గుండి, తిర్మలాపూర్, రామడుగు గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. సారలమ్మను కోయ పూజారులు గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 16: హౌసింగ్‌బోర్డు కాలనీలోని గద్దెపైకి సారలమ్మను కోయ పూజారి విఘ్నేష్ నిర్వాహకులతో కలిసి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్, బీజేపీ జాతీయ నాయకుడు సుగుణాకర్‌రావు, తోట మోహన్, సాగర్, మిర్యాల్కర్ నరేందర్, బొల్లం లింగమూర్తి, నందుకుమార్, ఆనంద్, మధు, సుధాకర్, నవీన్, ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇరుకుల్లలోని లక్ష్మీనృసింహస్వామి గుట్టపై నుంచి సారలమ్మను కోయ పూజారి సమ్మయ్య, జాతర నిర్వాహకుడు బుర్ర చంద్రయ్య ఆధ్వర్యంలో తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. జగన్మోహన్రెడ్డి, ప్రసాద్, సంపత్, తదితరులు పాల్గొన్నారు. నగునూర్ గ్రామంలో ఎర్ర గుట్టపై నుంచి అమ్మవారిని కోయ పూజారులు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. జాతర నిర్వాహకుడు వెంకట్‌రెడ్డి, అశోక్, సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి, సాయిల మహేందర్, సాయిల వినయ్‌సాగర్, శ్రీనివాస్, రాజాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.