కార్పొరేషన్, ఆగస్టు 17: నగరంలో ఆక్రమణలను తొలగించి, రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్‌రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని 33వ డివిజన్లో స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇరువైపులా ఫుట్‌పాత్‌లతో విశాలమైన రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో ఆక్రమణలను పరిశీలించి, సంబంధిత యజమానులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భగత్‌నగర్‌లో సెంట్రల్ వేర్ గోదాం రోడ్డు ఇరుకుగా ఉండడంతో గతంలో ప్రజలు ఇబ్బందులు పడగా, ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. భవిష్యత్‌లో సమస్య రాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ కృష్ణారావు, ఈఈ రామన్, ఏఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
వరద నీటి సమస్య రాకుండా చర్యలు
వానకాలంలో వరద నీటితో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మేయర్ సునీల్‌రావు తెలిపారు. నగరంలోని 56వ డివిజన్లో మంగళవారం ఆయన కార్పొరేటర్ రాజేందర్రావుతో కలిసి పర్యటించారు. భాగ్యనగర్, విద్యానగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, డ్రైనేజీల కనెక్టివిటిలను పరిశీలించారు. వరద నీరు సులువుగా వెళ్లేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్మార్ట్ సిటీ ప్రతినిధులు, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, 56వ డివిజన్లో వర్షపు నీరంతా ఇండ్ల ఆవరణలో, రోడ్లపై నిలిచి ఉంటున్నదని కార్పొరేటర్ రాజేందర్రావు వినతి మేరకు కాలనీల్లో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను, నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. కొత్త డ్రైనేజీలు నిర్మించి, వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేటర్ కచ్చు రవి, ఎస్ఈ కృష్ణారావు, స్మార్ట్ సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.