హుజూరాబాద్టౌన్, ఆగస్టు 30: సీఎం కేసీఆర్ దళితబంధు పథకం కింద ఇచ్చే రూ.10లక్షలను ఏడాదిలో రెట్టింపు చేయాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అందరూ ఒకే రకమైన వ్యాపారం పెట్టుకోకుండా లాభసాటిగా ఉండే డైరీ ఫాం పెట్టుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సోమవారం సాయంత్రం మంత్రి హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని దమ్మక్కపేట ఎస్సీ కాలనీలో దళితబంధు సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా బొరగాల శోభమ్మ- బొందయ్య ఇంటికి వెళ్లారు. వారితో కూర్చుండి దళితబంధు పథకంపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు. దళిత బంధు లబ్ధిదారులంతా ఒకే వ్యాపారంపై దృష్టి సారించకుండా అధికారుల సూచనతో వివిధ రంగాలపై మెలకువలు నేర్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కేసీఆర్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దళితబంధు పథకంలో ఇచ్చిన రూ.10 లక్షలను ఏడాదిలోగా రూ.20 లక్షలు చేసి చూపించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దమ్మకపేటలోని దళిత కాలనీలో కాలినడకన తిరుగుతూ వారి వివరాలు సేకరించారు. ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు.