ఆంగ్ల మాధ్యమంతో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
780 మంది పిల్లలతో జగిత్యాల జిల్లాలోనే టాప్
సకల వసతులు.. ప్రైవేట్‌కు దీటుగా బోధన
క్యూ కడుతున్న స్టూడెంట్స్.. వారంరోజులకే నో అడ్మిషన్ బోర్డు
ఆదర్శంగా నిలుస్తున్న బాలికల ఉన్నత పాఠశాల
కోరుట్ల, ఫిబ్రవరి 23: కోరుట్ల బాలికల బడి ఫుల్ అయింది. పూర్తి స్థాయి విద్యార్థినులతో కళకళలాడుతున్నది. ఎకరంన్నర విస్తీర్ణం.. ప్రశాంత వాతావరణం, అటల్ టింకరింగ్ సాంకేతిక ల్యాబ్.. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ బోధనతో ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలు క్యూకడుతుండగా, ప్రవేశాలు మొదలైన వారం రోజులకే నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. మొత్తంగా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో 780 మంది స్టూడెంట్స్‌తో జగిత్యాల జిల్లాలోనే నంబర్‌వన్‌గా ఉన్నది. అంతేకాదు ఉత్తీర్ణతలోనూ మేటిగా నిలుస్తున్నది.
కోరుట్లలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పిల్లలతో కళకళలాడుతున్నది. ఎకరన్నర విస్తీర్ణం.. విశాలమైన మైదానం.. ప్రశాంత వాతావరణంలో ఉన్న విద్యాలయంలో ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన అందిస్తూ జిల్లాలోనే అత్యధిక మంది విద్యార్థులు కలిగిన పాఠశాలగా గుర్తింపు పొందింది. పట్టణ నడిబొడ్డున సకల సౌకర్యాలతో విద్యార్థులను ఆకర్షిస్తూ ఉత్తీర్ణతలో మేటిగా నిలిచి మన్ననలు అందుకుంటున్నది. ఐదేళ్లుగా ఇంగ్లిష్ మాధ్యమంలో చేరేందుకు పరిమితికి మించి విద్యార్థుల రాకతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేయాల్సి వస్తున్నది. 1974లో తెలుగు, ఉర్దూ మాధ్యమంతో బాలికల ఉన్నత పాఠశాలగా రూపుదిద్దుకొని, 2005లో ప్రభుత్వపరంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభంతో సక్సెస్ పాఠశాలగా నిలదొక్కుకున్నది. బాలికల పాఠశాలలో బాలురకు అవకాశాలు కల్పించడంతో మూడు భాషల్లో విద్యను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
780 మందితో ప్రథమం..
పాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో 780 మంది పిల్లలతో జిల్లాలోనే నంబర్ వన్‌గా కొనసాగుతున్నది. తెలుగు మీడియంలో 217, ఇంగ్లిష్ 457 మంది, ఉర్దూ మీడియంలో 105 మంది అభ్యసిస్తున్నారు. నిబంధనల మేరకు ఒక్కో తరగతిలో 40 మందికి మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇంగ్లిష్ మాధ్యమంలో అత్యధికంగా తరగతికి 100 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్ పొందడంతో, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అదనపు సెక్షన్లు ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులు, సర్కారు స్కూళ్లలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక తరగతులు, ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలతో ఇటు వైపే దృష్టి సారిస్తున్నారు. ఏటా పదో తరగతి ఫలితాల్లో ఈ పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
నిధులు ఘనం.. వసతులు సకలం…
సక్సెస్‌కు మారుపేరుగా నిలిచిన పాఠశాలకు గతంలో సర్వశిక్షా అభియాన్ నుంచి రూ.14 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పాఠశాలకు మరమ్మతులతోపాటు మౌలిక వసతులు, మూత్రశాలలు, వాష్ బేసిన్, ఫ్యాన్లు, తరగతి గదుల్లో రంగులు వేయించి సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల పూల మొక్కలు నాటి పచ్చదనానికి బాటలు వేసుకున్నారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్‌తో విద్యార్థులకు సాంకేతికతపై అవగాహన..
విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానాన్ని పెంపొందించానే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన అటల్ టింకరింగ్ ల్యాబ్ పథకానికి ఈ పాఠశాల 2018లో ఎంపికైంది. రూ.12 లక్షలతో ల్యాబ్స్‌ను రూపొందించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో విద్యార్థుల ఊహాశక్తికి పదును పెట్టే పరికరాలు ఉండగా, ఆరు నుంచి 9వ తరగతి విద్యార్థులకు మెంటర్స్ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఇందులో పిల్లలకు వివిధ రకాలైన ఎలక్ట్రానిక్స్, చిప్స్, బోర్డు పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. కేయాన్ సాయంతో డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. తెరపై చిత్రాలు చూస్తూ పాఠాలు వినడం ద్వారా విద్యార్థులు విషయాలను సులభంగా ఆకళింపు చేసుకొని దీర్ఘకాలం జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో వివేకానంద ఎనర్జీ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎనర్జీని పొదుపుగా వాడుకోవడం సోలార్ ఎనర్జీ వినియోగంపై అవగాహన తరగతులు నిర్వహించారు. శిక్షణ పొందిన విద్యార్థులు పట్టణంలో కరపత్రాల ద్వారా ఇంధన వనరుల వినియోగాన్ని వివరిస్తూ ప్రచారంతో ఆకట్టుకున్నారు.
మన ఊరు మన బడితో మహర్దశ
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్న మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ రావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆధునిక సమాజంలో మాతృభాషతో పాటూ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధిస్తేనే ఉన్నతంగా రాణించేందుకు వీలు కలుగుతుంది. విద్యార్థుల ఉన్నతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
– గడెల భూపతి, ప్రధానోపాధ్యాయుడు
ఉత్తీర్ణతలో టీచర్ల పాత్ర కీలకం
విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంలో టీచర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అంకితభావంతో పని చేయడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం మెరుగవుతున్నది. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 5.30 వరకు ఉదయం పూట 8.30 నుంచి 9.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మన ఊరు – మన బడి ద్వారా ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించడం అభినందనీయం.
– చంద నాగరాజు, అటల్ ల్యాబ్ ఇన్చార్జి (ఎనర్జీ క్లబ్ కో ఆర్డినేటర్)
చదువు బాగా చెబుతున్నారు..
మా పాఠశాలలో చక్కగా చదువు చెబుతున్నారు. ఏటా ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో నిలువడంలో ఉపాధ్యాయుల కృషి ఉంది. కరోనా కారణంగా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు. అన్ని వసతులు కలిగి, రిజల్ట్‌లో ముందున్న మా పాఠశాలలో చదివేందుకు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధిస్తున్న టీచర్లకు కృతజ్ఞతలు.
– బోండ్ గ్రాంతి, తొమ్మిదో తరగతి విద్యార్థిని.