విద్యానగర్, నవంబర్ 19: దూరంగా ఉన్నామనే సాకుతో కడసారి చూపునకు కూడా రాని పుత్రులున్న ఈ రోజుల్లో.. తనకు ఏమీ కానీ అనాథ వృద్ధ శవాలకు అన్నీ తానై అంతిమ సంసారాలు నిర్వహిస్తున్నాడు కరీంనగర్‌కు చెందిన సీపెల్లి వీరమాధవ్. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన సీపెల్లి వీరమాధవ్ వీబీ ఫౌండేషన్ (వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమం) నిర్వహిస్తున్నాడు. అతను చేసే వృత్తితో ఆశ్రమం నడపడం సాధ్యపడదని తెలిసి కూడా నాడు ముందడుగు వేశాడు.
బంగారం లాంటి మనసుంటే చాలు ఆ భగవంతుడే అండగా ఉంటాడనే నమ్మకంతో 2003లో స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో ఆశ్రమానికి పురుడు పోసి అనాథ వృద్ధులను అకున చేర్చుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా 40 మంది వృద్ధులకు కడుపునిండా అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో అరకొరగా దాతలు అందించిన సొమ్ము సరిపోక అప్పుచేసి అనాథలకు ఏలోటు రాకుండా చూసుకున్నాడు.
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోని అనాథ వృద్ధులు ఈ ఆశ్రమంలో సేద తీరుతున్నారు. అయితే తన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ మృత్యు ఒడికి చేరిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఈ 20 ఏండ్లలో 119 మందికి తలకొరివి పెట్టాడు. కాశీ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తున్నాడు. శనివారం సైతం కాశీలో ఒకరికి పిండ ప్రదానం చేశాడు. అయితే ప్రభుత్వం సహకారం అందిస్తే తన ఆశ్రమంలో 100 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తానని వీరమాధవ్ చెబుతున్నాడు.