కార్పొరేషన్, సెప్టెంబర్ 6: కరీంనగర్లో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. వర్షాలకు రోడ్లపై ఎక్కడా నీరు నిల్వకుండా తగు చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల మీద నుంచి కాల్వల్లోకి వరద వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని విభాగాల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో భారీ వర్షాలపై కలెక్టర్ కర్ణన్, మేయర్ వై సునీల్‌రావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్మార్ట్‌సిటీ కన్సల్టెన్సీ, కాంట్రాక్టర్ల సమన్వయ లోపం మూలంగా ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల్లో ఇంజినీరింగ్ అధికారులు తప్పిదం కొట్టొచ్చినట్టు కనబడుతున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్అండ్బీ అధికారులు, మున్సిపాలిటీ పారిశుధ్య విభాగం సిబ్బంది సమన్వయంతో 14.5 కిలో మీటర్ల ప్రధాన రహదారుల్లో రోడ్డుకు ఫుట్‌పాత్‌కు హోల్స్ వేసి డ్రైనేజీలోకి వర్షం నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రీంనగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యధికంగా నిధులు కేటాయించారని, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కరీంనగర్ -కామారెడ్డి రోడ్డు పనుల జాప్యంతో రాంనగర్ ప్రధాన రహదారిపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఆర్అండ్బీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా మున్సిపల్‌తో పాటు పోలీసులు, ఇతర విభాగాల అధికారులు కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. నగరంలో వరద వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, వర్షపు నీరు సులువుగా వెళ్లేలా డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, నగరపాలక సంస్థ, ఆర్అండ్బీ, విద్యుత్, పోలీస్, రెవెన్యూ విభాగాల అధికారులు పాల్గొన్నారు.