హుజూరాబాద్, సెప్టెంబర్ 7: డివిజన్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. అన్ని మండలాల్లో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. హుజూరాబాద్ మండలంలో 30ఏళ్లలో రికార్డు స్థాయిలో 25.34 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణ సమీపంలోని చిలుకవాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. దీంతో పాటు ఒర్రెలను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, పంట పొలాలు నీట మునిగాయి. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సర్పంచులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోయాయి. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
రాకపోకలకు అంతరాయం
హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 7: మండలంలోని మందాడిపల్లిలోని పెద్దమోరి వద్ద కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై వరద ప్రవాహం వల్ల రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. రంగాపూర్‌లో పలువురి ఇండ్లల్లోకి నీరు చేరగా, సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మోటర్లతో తొలగించారు. జూపాక, బొత్తపల్లి, కుర్మపల్లి గ్రామాలకు వెళ్లే రహదారుల కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెల్పూర్ పెద్ద చెరువు మత్తడి దుంకింది. గ్రామంలోకి నీరు రావడంతో ఎక్స్‌కవేటర్‌తో మత్తడి రాళ్లను తొలగించారు. కాట్రపల్లి, సిర్సపల్లిలో పాత ఇండ్లు నేలమట్టమయ్యాయి. వాటిని స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
హుజూరాబాద్‌లోని కిందివాడ, మామిండ్లవాడ, తదితర ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలవడంతో పాటు పలువురి ఇండ్లల్లోకి చేరింది. ఏక్‌మినార్ నీట మునగడంతో స్థానిక కౌన్సిలర్ ఉజ్మానూరిన్, ఆమె భర్త కో ఆప్షన్ మాజీ సభ్యుడు బీఎస్ ఇమ్రాన్ ఎక్స్కవేటర్ సాయంతో నీటిని పొలాల మీదుగా మళ్లించారు. లోతట్టు ప్రాంతాలైన 12, 13, 17, 29వ వారుల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లు కొండ్ర జీవితానరేశ్, సృజనాపూర్ణచందర్, తొగరు సదానందం సహాయ చర్యలు చేపట్టారు. 13వ వార్డులో ఎండీ ఆశబేగం ఇల్లు కూలిపోగా తక్షణ సాయంగా రూ.5 వేలు అందజేశారు. వరద ప్రభావిత ప్రాంతాలు 13, 23వ వార్డుల్లో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో టీఆర్ఎస్ నాయకులు కొండ్ర నరేశ్, మొలుగు పూర్ణచందర్ మధ్యాహ్నం, రాత్రి భోజనాలు వండించి ఇంటింటికీ ప్యాకెట్లు పంచి పెట్టారు. టీఆర్ఎస్ నాయకులు దొంత రమేశ్, దుబాసి బాబు, బత్తుల సమ్మయ్య, సందమల్ల బాబు, మైకెల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సుంకె
మండల కేంద్రంతో పాటు మల్యాల, సిరిసేడు, టేకుర్తి, పాతర్లపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల్లో పలువురి ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనగర్తి-మడిపల్లి రహదారి దెబ్బతిన్నది. కాగా, ఇల్లందకుంట మండలం సిరిసేడు, పాతర్లపల్లి, సీతంపేట, బుజూనూర్, వంతడ్పుల, టేకుర్తి, రాచపల్లి గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి పర్యటించారు. వర్షపు నీరు ఇండ్లల్లోకి చేరడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సిరిసేడు గ్రామానికి చెందిన జయమూర్తి అనే రైతుకు చెందిన కోళ్ల ఫాంలోకి వర్షపు నీరు చేరడంతో 500 కోళ్లు చనిపోగా, రైతును పరామర్శించారు. పాతర్లపల్లి గ్రామంలో బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సర్పంచులు ఎండీ రఫీఖాన్, వెంకటస్వామి, అరుణ, ఆదిలక్ష్మి, మానస, రాంమల్లయ్య, ఎంపీటీసీలు చిన్నరాయుడు ఓదెలు, ఐలయ్య, మాజీ సర్పంచ్ బుర్ర రమేశ్ తదితరులున్నారు.
సీతంపేటలో జడ్పీ చైర్పర్సన్ పరిశీలన
ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో ఇండ్లల్లోకి నీరు చేరగా, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వరద ప్రాంతాల్లో తహసీల్దార్ సురేఖ, ఎస్ఐ తిరుపతి, పోలీస్ స్టేషన్ ఇన్చార్జి రజినీకాంత్ పర్యటించారు. ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు.
21.6 సెంటీమీటర్ల వర్షపాతం
మండలంలో 21.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెనేపల్లి తుమ్మల చెరువు కట్టు కాలువ వరదనీటి ప్రవాహానికి తెగిపోవడంతో సైదాపూర్ -రాయికల్ రహదారిపై బొత్తల్లపల్లి కల్వర్టు, సైదాపూర్ -హుజూరాబాద్ రహదారిపై సైదాపూర్ కల్వర్టు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్-మొలంగూరు రహదారిపై సోమారం చౌరస్తా, సోమారం కల్వర్ట్ వద్ద నీటిప్రవాహానికి రాకపోకలకు అంతరాయం కలిగింది. సోమారం-ఎక్లాస్పూర్ రహదారిపై ఎక్లాస్పూర్ కల్వర్ట్ వద్ద నీటి ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. సర్వాయిపేట-హుస్నాబాద్ రహదారిపై సర్వాయిపేట వద్ద రోడ్డు కొట్టుకు పోవడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. రాయికల్ జలపాతం భారీగా పడుతున్నది. వరద ప్రవాహం ఎకువగా ఉన్న కల్వర్టుల వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సదానందం, ఎస్ఐ ప్రశాంతరావు సూచించారు.
మత్తడి దుంకుతున్న చెక్‌డ్యాంలు
భారీ వర్షానికి వీణవంక, కోర్కల్ వాగుపై చెక్‌డ్యాంలు మత్తడి దుంకుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో పంటపొలాలు, వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటర్లు నీట మునిగిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. నర్సింగాపూర్ 20 మోరీల వద్ద వరద ఎక్కువ కావడంతో కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాల రాకపోకలు సాయంత్రం వరకు నిలిచిపోయాయి. కోర్కల్ గ్రామంలో వర్షానికి కమ్మరి దామయ్య ఇల్లు కూలిపోయింది. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, అధికారులు సూచించారు.
జలదిగ్బంధంలో గ్రామాలు
మండలంలో సోమవారం రాత్రి 215.2ఎంఎంల వర్షం కురిసింది. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ జలమయం కాగా, అబాది జమ్మికుంటకు వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు భారీగా చేరగా రాకపోకలు నిలిచిపోయాయి. మాచనపల్లి, కాపులపల్లి, పాపక్కపల్లి ప్రధాన రహదారులపై కల్వర్టులు నీట మునగగా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. నగరం గ్రామ చెరువు నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరగా, ప్రజాప్రతినిధులు మొరం పోసి మరమ్మతు చేశారు. మడిపల్లి చెరువు నిండి ప్రమాద సూచిక వరకు నీటి మట్టం చేరగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్స్‌కవేటర్‌తో కట్టకు గండి పెట్టారు. వర్షానికి మోత్కులగూడెం, మడిపల్లి, మాచనపల్లి, బిజిగిరిషరీఫ్, వెంకటేశ్వరపల్లి గ్రామాల్లో ఏడు ఇండ్లు నేలమట్టమయ్యాయి.
టీఆర్ఎస్ నాయకుల సహాయక చర్యలు
పట్టణ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ జలమయం కావడం, ఇండ్లల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేశ్‌గౌడ్ సహాయక చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కాలనీలో పర్యటించి ప్రజలకు మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొని వరద నీటిని బయటికి పంపారు.