కార్పొరేషన్, అక్టోబర్ 12: ఉప ఎన్నిక సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వివిధ బ్యాంకుల్లో లక్ష నగదుకుపైగా జరిగే లావాదేవీలపై నిఘా పెట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్.హెచ్ ఎలమురుగుతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గ పరిధిలో వివిధ బ్యాంకుల్లో అకౌంట్ల నుంచి అనుమానితంగా ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి లక్షకు పైగా డబ్బులు డ్రా అయిన.. జమైన ఖాతాలపై నిఘా పెడుతున్నట్లు తెలిపారు. అలాగే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక ఖాతా నుంచి వివిధ ఖాతాలకు ఆన్లైన్ విధానంలో యూపీఐ లేదా గూగుల్ పే, ఫోన్ పే ఇతర యాప్ల ద్వారా జరిగే ట్రాన్జాక్షన్లపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ హుజూరాబాద్ సెగ్మెంట్లోనే ఉన్నందున పక నియోజకవర్గాల్లో అభ్యర్థి ఫొటో, గుర్తుతో నిర్వహించే సభలు, సమావేశాల ఖర్చులను సైతం సంబంధిత అభ్యర్థుల ఎన్నికల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.
నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే ఏజెంట్లకు అనుమతి..
ఈసీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్, కౌటింగ్లో పాల్గొనాలనుకునే అభ్యర్థుల ప్రతినిధులు 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఒక డోస్ టీకా సైతం తీసుకొని వారు విధుల్లో పాల్గొనాలనుకుంటే 48 గంటల ముందు తీసిన ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ఇవ్వాలన్నారు. ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్, టీఆర్ఎస్, కాంగ్రెస్, పీడీపీ, బీజేపీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.