కలెక్టరేట్, ఏప్రిల్ 5 : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని, దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తాలో నిర్వహించిన జగ్జీవన్‌రామ్ జయంత్యుత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహనీయులు జన్మించిన మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు ఈర్ష్య పడుతున్నా యని చెప్పారు. అంబేద్కర్, జ్యోతిబాఫూలే, జగ్జీవన్‌రామ్ దేశ రూపురేఖలు మార్చి ఆణిముత్యాలుగా మారారని కొనియాడారు. సమతావాదిగా పేరుగాంచిన జగ్జీవన్‌రామ్ దళితజాతి అభివృద్ధి కోసం మాత్రమే పోరాడలేదని, బడుగు, బలహీన వర్గాల కోసం, దేశ పురోగతి, ఔన్నత్యం కోసం ఉద్యమించాడని గుర్తు చేశారు.
మహానుభావుల ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అట్టడుగు, నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతోనే దళితబంధుకు రూ.17 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 100 మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తూ, రాబోయే రోజుల్లో దశలవారీగా సాచులేషన్ మూడ్‌లో వర్తింపజేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో మొదటి విడుతగా 300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.9.90 లక్షల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెంది న 15 మందికి పాసుబుక్కులు, మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. అలాగే, కులాంతర వివాహాలు చేసుకున్న 5 జంటలకు ఒక్కొక్కరికీ రూ.2.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. మరో 48 మందికి షెడ్యూలు కులాల అభివృద్ధి సంస్థ అధికారులు పంపిణీ చేశారు.
రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర ఎనలేనిది..
జగ్జీవన్‌రామ్ సొంత రాష్ట్రం.. జిల్లాలోనూ ఆయన జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరపడం లేదని, దళిత సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా వేడుకలు నిర్వహిస్తుండడం అభినందనీయమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. రాజ్యాంగ రచనలో జగ్జీవన్‌రామ్ పాత్ర ఎనలేనిదన్నారు. దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘దళితబంధు’ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మానకొండూరు ఎమ్మె ల్యే రసమయి మాట్లాడుతూ దళిత సామాజిక, అణగారిన పేదల అభివృద్ధే లక్ష్యంగా జగ్జీవన్‌రామ్ రాజకీయ జీవితం సాగిందన్నారు.
ఆయన కుమా ర్తె మీరాకుమారి లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించారని గుర్తు చేశారు. మేయర్ వై సునీల్‌రావు మా ట్లాడుతూ దళిత జాతి పురోగతిలో జగ్జీవన్‌రామ్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మా ట్లాడుతూ చిన్న వయసులోనే జగ్జీవన్‌రామ్ రాజకీయ నాయకుడిగా ఎదిగాడని, ఎమర్జెన్సీ సమయంలో తన పార్టీ నాయకురాలు, ప్రధాని ఇందిరాగాంధీని సైతం వ్యతిరేకించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత మహనీయుల స్ఫూర్తితోనే షెడ్యూలు కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందని, సుభిక్షంగా వర్ధిల్లుతున్నదని చెప్పారు.