కార్పొరేషన్, మే 16: బడుగు బలహీనవర్గాల బతుకులు మారాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన దళితబంధుతో దళితులు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు అభ్యున్నతి సాధిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదన్నారు. లబ్ధిదారులు తాము ప్రారంభిస్తున్న వ్యాపారాలను మరింత విస్తరించుకోవాలని, ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలన్నారు. బడుగు, బలహీనవర్గాల్లో వెలుగులు తేవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో గిరిజన వర్కింగ్ మహిళ హాస్టల్ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న మొబైల్, టెంట్ హౌస్, ఎలక్ట్రికల్స్ షాపులను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. దళితులు కూడా ఆర్థికంగా బాగుపడాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకువచ్చారని, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా రూ.10 లక్షలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు. గతంలో కార్మికులుగా పని చేసిన వారంతా, ఇప్పుడు ఈ పథకం ద్వారా యజమానులుగా మారుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ, కలెక్టర్ కర్ణన్, మేయర్ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు గంట కళ్యాణి-శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, సర్పంచ్ సంతోష, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
టెంట్‌హౌస్‌కు ఓనర్నైన
నేను పన్నెండేళ్లుగా టెంట్‌హౌస్ ఫీల్డ్‌లోనే కార్మికుడిగా పనిచేస్తున్న. నా భార్య మమత డిగ్రీ చదువుకొని ఇప్పుడు ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నది. సీఎం కేసీఆర్ ఏ ఆలోచనతో అయితే దళితబంధు తెచ్చి పది లక్షలు ఇస్తుండో గానీ, మా బతుకులైతే మారుతున్నయ్. నా జీవితమంతా కష్టపడి సంపాదించినా ఇంత పెద్ద షాపు పెట్టే అవకాశం వచ్చేదో లేదో. కానీ, కేసీఆర్ సారు తెచ్చిన ఈ అద్భుతమైన పథకం వల్ల టెంట్‌హౌస్‌కు ఓనర్నైన. టెంట్, లైటింగ్, డెకొరేషన్ షాపును మరింత డెవలప్ చేసుకుంట. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్త. నగరంలో రోడ్డు విస్తరణలో భాగంగా నాకు చెందిన స్థలం సగానికి పైగా పోయింది. అప్పుడు ఎంతో బాధపడ్డ. కానీ, అదే ప్రభుత్వం ఇప్పుడు 10 లక్షలు ఇచ్చి అండగా నిలిచింది. నిజంగా మాకు జీవితంలోనే ఇది ఎంతో గుర్తుండిపోయే రోజు.
– కాడె రాజశేఖర్, సుభాష్‌నగర్
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
ఏదైనా వ్యాపారం చేద్దామంటే దగ్గరి వారు కూడా సాయం చేయరు. అలాంటిది కేసీఆర్ సారు దళితుల బతుకుల్లో మార్పులు తేవాలని ఎంతో గొప్పగా ఆలోచించి దళితబంధు తెచ్చిండు. పథకం కింద 10 లక్షల రూపాయలు ఇస్తున్నడు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటం. ఇది మా బతుకుల్లో ఎన్నో మార్పులు తెస్తది. నేను పెట్టుకున్న ఎలక్ట్రికల్ షాపును మరింత విస్తరిస్త. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్త. మా పిల్లలను మంచిగా చదివిస్తం.
– గసికంటి అరుణ్‌కుమార్, కిసాన్‌నగర్