హుజూరాబాద్/జమ్మికుంట/ జమ్మికుంట రూరల్/ హుజూరాబాద్‌టౌన్/ ఇల్లందకుంట/ కమలాపూర్రూరల్/ వీణవంక/ అక్టోబర్10 : బీజేపీ నాయకులు జూటా మాటలు మాట్లాడడమే కాకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, బట్టకాల్చి మీదేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలు ఈటల రాజేందర్ మోసానికి, గెల్లు శ్రీనివాస్ విధేయతకు మధ్య జరుగుతున్నదన్నారు. ప్రచారంలో రాజేందర్ ఎకడ మాట్లాడినా తాను ఈ పని చేసినా, గెలిస్తే మరో పని చేస్తా అని చెప్పకుండా టీఆర్ఎస్ పార్టీపై బురద జల్లుతున్నాడన్నారు. ఉత్త మాటలు చెప్పే బీజేపీ కావాలా.. చెప్పిన పనులు చేసే టీఆర్ఎస్ కావాలో..? ఆలోచించుకొని ఓటేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో హుజూరాబాద్ బీజేపీ పట్ణణ అధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డితో పాటు ఏబీవీపీ, బీజేపీ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ ఇతర విద్యార్థి సంఘాల నాయకులు సుమారు 600మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. అలాగే టీడీపీ మాజీ ఎంపీపీ వెంకట్రాజం, టీడీపీ పట్టణాధ్యక్షుడు రామగిరి అంకూస్‌తో పాటు 150మంది కార్యకర్తలు, ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు చేరగా, హరీశ్‌రావు మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం రోజుల నుంచి ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధర పెంచుకుంటూ బీజేపీ ప్రభుత్వం పోతున్నదని, మేం ధరలు పెంచుతున్నాం మాకు ఓటు వేయమని అడుగుతావా రాజేందర్ అని వ్యంగ్యస్ర్తాలు వేశారు. ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక నాలుగు అబద్దాలు చెప్పి సింపతీ గైన్ చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ఏండకు ఆ గొడుగు పట్టే నీవు పార్టీ మారినంత మాత్రాన ప్రజలు మారాలా.. అబద్ధాలు నిజాలయితయా.. అని ప్రశ్నించారు. ఆరు నూరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ మేయర్ సునీల్‌రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, వడ్లూరి విజయ్‌కుమార్, గందె శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, మొలుగూరి పూర్ణచందర్, దొంత రమేశ్, దండ విక్రమ్‌రెడ్డి ఉన్నారు. కాగా, బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పంజాల సతీశ్‌గౌడ్, సీనియర్ నాయకులు మంద సదాశివరెడ్డి, గాయ్ కుమార్, కళ్లెపు తిరుపతిగౌడ్, మాజీ ఉప సర్పంచ్ దండ దిలీప్‌రెడ్డి, పల్లె తిరుపతిగౌడ్, పుట్టపాక సమ్మయ్యయాదవ్ ఆధ్వర్యంలో వందలాది మంది టీఆర్ఎస్లో చేరడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
చేరికల ప్రభంజనం
కారు జోరుమీదున్నది. చేరికల ప్రభంజనంతో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నది. ఇప్పటికే ప్రజారంజక పాలనతో అజేయశక్తిగా మారిన టీఆర్ఎస్.. సకలజనం మద్దతుతో బలీయమైన శక్తిగా ఎదుగుతున్నది. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ, టీడీపీ పట్ణణాధ్యక్షులు నందగిరి మహేందర్‌రెడ్డి, రామగిరి అంకూస్ సహా 600 మంది ఏబీవీపీ, బీజేపీ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పార్టీలో చేరగా, జమ్మికుంటలో బీజేపీ నాయకులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కండువా కప్పారు. ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజలను పార్టీలోకి ఆహ్వానించారు.
ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీలో చేరిండు..
ఈటల తన ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీలో చేరిండు. ఈటల ధనబలంతో తానే గెలుస్తాననే అహంకారభావనతో ఇంకా ఉన్నాడు. రాజీనామా చేసిన రోజే ఈటల ఓటమి ఖాయమైంది. హుజూరాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. వారికి ఈటల కన్నా ఎక్కువ మేదస్సు ఉన్నది. ఈటలకే కాదు.. మాకు ఆత్మగౌరవం ఉన్నది. ఆస్తులు లేవని అంటున్నావ్ కదా..? శామీర్‌పేటలో ఇల్లు, హైదరాబాద్‌లో కోళ్లఫారాలు ఎక్కడి నుంచి వచ్చినయ్. మొదట నామినేషన్ వేసినప్పుడు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎన్ని ఉన్నయో ప్రజలకు అంతా తెలుసు. ఇక్కడ నువ్వు గెలిచేది లేదు. గెలిచేది గెల్లు శ్రీనివాస్‌యాదవే. ఆత్మగౌరవం అనే మాట మాట్లాడే అర్హత నీకు లేదు.
బీజేపీలో యువత ఖాళీ..
హుజూరాబాద్‌లో గులాబీ యువ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రవాహంలా యువత, విద్యార్థులు వందలాదిగా వచ్చి గులాబీ ప్రవాహంలో కలుస్తున్నారు. తాజాగా ఆదివారం వందలాది మంది యువకులు మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పంజాల సతీశ్‌గౌడ్, సీనియర్ నాయకులు మంద సదాశివరెడ్డి, గాయ్ కుమార్, కళ్లెపు తిరుపతిగౌడ్, మాజీ ఉప సర్పంచ్ దండ దిలీప్‌రెడ్డి, పల్లె తిరుపతిగౌడ్, పుట్టపాక సమ్మయ్య యాదవ్ ఆధ్వర్యంలో వందలాది మంది టీఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. బీజేపీలో బలమైన వర్గంగా ఉన్న ఆ నాయకులు పార్టీని వీడడం, ఉప ఎన్నికల నేపథ్యంలో సర్వత్రా చర్చనీయాంశమైంది.