పెద్దపల్లి రూరల్ ఆగస్టు, 24: ఉపాధి పనుల్లో ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించేందుకు కూలీలకు పని దినాల సంఖ్య పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మండలపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఓదెల, కమాన్పూర్, పాలకుర్తి మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ముందుకు సాగాలన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గ్రామాల్లో చేపడుతున్న పనుల్లో అందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. లక్ష్యాలను అధిగమించడంలో సంబంధిత అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరించి చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుకోసం అందరు కూడా బాధ్యతాయుతంగా మెదలాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్, ఓదెల, కమాన్పూర్, పాలకుర్తి ఎంపీడీవోలు సత్తయ్య, రమేశ్, వెంకటచైతన్యతో పాటు ఆయా మండలాలకు చెందిన సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.