జిల్లా స్థాయి యువజన సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ
కొత్తపల్లి, ఫిబ్రవరి 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ యువజన సంఘాల ప్రతినిధులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో నెహ్రూ యువకేంద్రం (కరీంనగర్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజన సమ్మేళన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువజన సంఘాల ప్రతినిధులు గ్రామీణ స్థాయిలో బాగా పని చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ సందర్భంగా 2019-20, 2020-21 సంవత్సరాల్లో ఉత్తమ యువజన సంఘాలుగా ఎంపికైన నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ (చొప్పదండి), యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ (తీగలగుట్టపల్లి)కి రూ. 25 వేల చొప్పున ప్రోత్సాహకం, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. అలాగే, 25 యువజన సంఘాలకు రూ. 4 వేల విలువైన క్రీడా సామగ్రిని అందజేశారు. నెహ్రూ యువకేంద్రం యూత్ ఆఫీసర్ వెంకట్రాంబాబు, వలంటీర్ ఎంపిక కమిటీ సభ్యుడు పొలాస శంకర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్‌కుమార్, జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవేందర్, డీవైఎస్వో రాజవీరు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శ్రీవాణి, ఎన్‌వైకే సహాయకులు రవీందర్, యువజన అవార్డీలు ఆర్ కళింగ శేఖర్, ఆలువాల విష్ణు, సత్తినేని శ్రీనివాస్, వొడ్నాల రాజు తదితరులు పాల్గొన్నారు.