కార్పొరేషన్, ఆగస్టు 17: రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే విపక్షాలు దివాళాకోరు విమర్శలు చేస్తున్నాయని కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు మండిపడ్డారు. తమ పార్టీ పునాదులు ఎక్కడ కదిలిపోతాయోనన్న భయంతో ఈ పథకాన్ని అడ్డుకునేందుకు బీజేపీ సవాలక్ష ప్రయత్నాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్బీఎస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడేైళ్లెనా ఏ రోజు కూడా ప్రజల పక్షాన ఆలోచించని, వారి సంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ నాయకులు కేవలం రెచ్చగొట్టే, మభ్యపెట్టే మాటలతో పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. దళితులు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెడితే ఓర్వలేని బండి సంజయ్ వంటి నాయకులు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న 17 రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ చేయాల్సింది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, బీజేపీ పాలిత రాష్ర్టాల సందర్శన యాత్ర అని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసే ముందు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం ఒరగబెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కిషన్ రెడ్డి ఒక వైపు, బండి సంజయ్ ఒక వైపు, ఈటల మరోవైపు యాత్రల పేరుతో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించిందని, త్వరలోనే 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు. బండి సంజయ్, ఆ పార్టీ నాయకులకు తెలిసింది ప్రజలను మాటలతో రెచ్చగొట్టడం, తప్పుదోవ పట్టించి మోసం చేయడం మాత్రమేనని విమర్శించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తెలవడంతో బీజేపీ అభ్యర్థి ఈటల పార్టీని చూడొద్దని, కేవలం తనని చూసి ఓటు వేయాలని ప్రచారం చేయడం వారి పరిస్థితికి అద్దం పడుతున్నదన్నారు. సాగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీకి హుజూరాబాద్‌లోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని బానిస అని ఈటల చేసిన వ్యాఖ్యలే ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు వాల రమణరావు, తోట రాములు, కుర్ర తిరుపతి, సరిళ్ల ప్రసాద్, కంసాల శ్రీనివాస్, గందె మాధవి, నేతికుంట యాదయ్య, గుగ్గిళ్ల జయశ్రీ, బోనాల శ్రీకాంత్, ఐలేందర్‌యాదవ్, నాయకులు ఆకుల నర్సయ్య పాల్గొన్నారు.