ధర్మపురి, ఏప్రిల్ 19 : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా.. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ గొప్ప మనసుతో అండగా నిలుస్తూ ముందుకెళ్తున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. 1959 ఏప్రిల్ 20న కొప్పుల లింగయ్య-మల్లమ్మ దంపతులకు జన్మించిన ఆయన స్వస్థలం పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం, కుమ్మరికుంట. కాగా, గోదావరిఖనిలో స్థిరపడ్డారు. భార్య స్నేహలతను ఆదర్శ వివాహం చేసుకున్నారు. కొప్పుల తల్లిదండ్రులు లింగయ్య-మల్లమ్మల పేరున నెలకొల్పిన ఎల్ఎమ్ కొప్పుల ఆర్గనైజేషన్ సర్వీస్ చైర్ పర్సన్‌గా స్నేహలత సమాజసేవ చేస్తూ ఎందరో పేదలకు అండగా నిలుస్తున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న ఈశ్వర్ 1976లో సింగరేణి ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి కార్మికుల పక్షాన పోరాడుతూనే రాజకీయాల వైపు ఆకర్శితులయ్యారు. ఈ క్రమంలో 1994లో మేడారం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
2004 ఎన్నికల్లో మేడారం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీటీపీ అభ్యర్థి మాల మల్లేశంపై 56,563 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2008 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం నిర్వహించిన ఉపఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామిపై 28,137 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడితో మేడారం అసెంబ్లీ ప్రస్థానం ముగియగా, 2009 సాధారణ ఎన్నికల్లో పునర్విభజన తర్వాత ధర్మపురి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఈశ్వర్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై 1484 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2009లో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను ఢిల్లీకి రుచి చూపించాలని కేసీఆర్ ఉధృతంగా ప్రచారం నిర్వహించగా, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్‌పై 58,891 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇటు తెలంగాణ కోసం పోరాడుతూనే, అటు నియోజకవర్గ అభివృద్ధికి తీవ్రస్థాయిలో కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద కర్రసాము చేసి అందరి దృష్టిని ఆకర్శించారు.
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్‌పై 18,679 ఓట్ల మెజారిటీతో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చీఫ్‌విప్‌గా కొనసాగుతూనే నాలుగేళ్లలో ధర్మపురి నియోజకవర్గాన్ని ప్ర గతి పథాన తీసుకెళ్లారు. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై గెలుపొందిన ఈశ్వర్ రాష్ట్ర ఎస్సీ,మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు తనకు కేటాయించిన శాఖను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు.
హ్యాపీ బర్త్ డే టూ యూ
-ఘనంగా కొప్పుల ముందస్తు జన్మదిన వేడుకలు
ధర్మపురి,ఏప్రిల్ 19 : రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పుట్టిన రోజు సందర్భంగా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో నాయకులు మంగళవారం ముందస్తు సంబురాలు నిర్వహించుకున్నారు. బుధవారం మంత్రి ఈశ్వర్ 63వ జన్మదినం సందర్భంగా మంగళవారమే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, డీసీఎమ్మెస్ చైర్మన్ డా శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు తదితరులున్నారు.