ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం
1.8 కిలో మీటర్ల మేర అభివృద్ధి
ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తం:మేయర్ వై సునీల్‌రావు
మానేరు డ్యాం కట్ట సమీపంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకోవడానికి వీలుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ట్రాక్ నిర్మాణం చేపడుతున్నారు. డ్యాం కట్ట సమీపంలో సీఎం కేసీఆర్ హరితహారంలో భాగంగా మొక్క నాటిన ప్రాంతం నుంచి లేక్ పోలీస్ స్టేషన్ వరకు సుమారు 1.8 కిలో మీటర్ల మేరకు వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. వాకింగ్ ట్రాక్ వెంట లైటింగ్‌తో పాటు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ ట్రాక్
మానేరు డ్యాం కట్ట సమీపంలో రూ. 50 లక్షల వ్యయంతో ప్రస్తుతం 1.8 కిలో మీటర్ల మేరకు మూడున్నర మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ పనులు అత్యంత వేగంగా చేపడుతున్నారు. ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ లక్ష్యం నిర్దేశించింది. ప్రస్తుతం సాగుతున్న పనులతో పాటు వాకింగ్ ట్రాక్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వాకింగ్ ట్రాక్ వెంట లైటింగ్‌తో పాటు గ్రీనరీ పెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ట్రాక్ వెంట అక్కడక్కడ వాకింగ్‌కు వచ్చే ప్రజలు కూర్చోవడానికి బెంచీలు, యోగా ఇతర శారీరక వ్యాయామం చేయడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం డ్యాం సమీపంలో ఓపెన్ జిమ్ ఉండగా మరో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
సకల సదుపాయాలతో వాకింగ్ ట్రాక్
మానేరు డ్యాం కట్ట సమీపంలో ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చే ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నం. ఓపెన్ జిమ్‌లు, కూర్చోవడానికి బెంచీలు, లైటింగ్‌తో పాటు ట్రాక్ పక్కన ఆహ్లాదం కోసం వివిధ రకాల మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతం. నగరంలో ఇప్పటికే పట్టణ ప్రగతి నిధులతో 11 ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్‌లు అభివృద్ధి చేసినం. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రజల డిమాండ్ మేరకు ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాకింగ్ ట్రాక్‌లను నిర్మిస్తున్నం. డ్యాం కట్ట వెంట చేపడుతున్న వాకింగ్ ట్రాక్ పనులను ఏప్రిల్ వరకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం.
– మేయర్ వై సునీల్‌రావు