గంగాధర, ఫిబ్రవరి 19 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 4జీ మొబైల్ ఫోన్లను మండలంలోని బూరుగుపల్లిలో ఆశ కార్యకర్తలకు శనివారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించారని కొనియాడారు. ఉమ్మడి పాలనలో సర్కారు దవాఖానలు అధ్వానంగా ఉండేవని, అక్కడికి వెళ్లిన వారికి పినాయిల్ వాసన వచ్చేదని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కార్ దవాఖానలను అభివృద్ధికి చేయడంతో ప్రస్తుతం ఇక్కడ అన్ని వసతులతో కూడిన నాణ్యమైన వైద్యం అందుతున్నదన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ చిత్రానికి ఆశ కార్యకర్త లు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రవిశంకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు సాగి మహిపాల్‌రావు, ఆరెల్లి చంద్రశేఖర్, ఎంపీపీ చిలుక రవీందర్, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శంకర్‌గౌడ్, కిష్టారెడ్డి, లక్ష్మణ్, వినయ్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు ఉన్నారు.