పెద్దపల్లి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని, స్వరాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు సాధ్యమయ్యాయని, దేశానికి మనమే ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖనిలో పోలీస్ గెస్ట్‌హౌస్, వన్‌టౌన్ మోడల్ ఠాణాతోపాటు అంతర్గాం పోలీస్‌స్టేషన్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యే చందర్‌తో కలిసి ప్రారంభించి, మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల పోలీసింగ్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. టెక్నాలజీ వినియోగం ద్వారా ఎన్నో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాతే పోలీసులపై రాజకీయ జోక్యం తగ్గిందని, పోలీసులకు స్వేచ్ఛ కల్పిస్తూ వారు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే వీలు కలిగిందని వివరించారు. షీ టీమ్స్ ఏర్పాటు చేయడం, 100కు డయల్ చేయడంతోనే పోలీసులు 5 నుంచి 10 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని చెప్పారు. ఇంకా పోలీసులకు అధునాతన వాహనాలు అందించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద ఆధునిక సదుపాయాలతో భవనాలు నిర్మిస్తున్నారని వివరించారు. మన పోలీసుల పనితీరు బాగుందని, ఈ క్రమంలో దేశ స్థాయిలో ఎంతో మంది అవార్డులు, రివార్డులు పొందారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులు కృషి చేస్తూనే ఉన్నారని, డీజీపీ మహేందర్‌రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకొని మంచి పోలీసింగ్‌తో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. గతంలో అరకొర సౌకర్యాలతో ఉండే పోలీస్స్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించడం, కనీవినీ ఎరుగని రీతిలో సౌకర్యాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. గోదావరిఖని పట్టణంలో మోడల్ ఠాణా నిర్మాణంతో పాటు పోలీస్ గెస్ట్‌హౌస్ ఆధునిక పద్ధతిలో నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా సీఎం కేసీఆర్ పోలీస్ శాఖ కోసం వందలాది కోట్లు ఇస్తున్నారని, కొత్తగా కమిషనరేట్ల ఏర్పాటు,సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పునాది
పోలీసులు, ప్రజలు మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పునాది వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టి సఫలీకృతుడయ్యారు. గోదావరిఖనిలో ఆధునిక వసతులతో పోలీస్ గెస్ట్‌హౌస్, వన్‌టౌన్ మోడల్ ఠాణా, అంతర్గాం పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి ఈ ప్రాంతానికి చెందిన పోలీస్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి కృషి మరువలేనిది. నేరాల నియంత్రణకు విశేష కృషిచేస్తున్న పోలీసులు, ప్రజలతో మమేకమై ఉంటూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. – కొప్పుల ఈశ్వర్, మంత్రి
కేసీఆర్ కృషితోనే ఆధునిక భవనాలు
రామగుండం పారిశ్రామిక ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే ఇక్కడ ఆధునిక పోలీస్ గెస్ట్‌హౌస్, గోదావరిఖని వన్ టౌన్ మోడల్ ఠాణాగా రూపుదిద్దుకున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండతోనే ఎన్టీపీసీ యాజమాన్యం సీఎస్సార్ నిధుల నుంచి గెస్ట్‌హౌస్‌కు రూ.3.4కోట్లు, సింగరేణి సంస్థ గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు రూ.3.5కోట్ల కేటాయించింది. ఆ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు సాగుతున్న పోలీసులు ప్రజలకు మరింత చేరువకావాలి. అన్ని విధాలుగా సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
– కోలేటి దామోదర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
గోదావరిఖనికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు
రామగుండం పారిశ్రామిక ప్రాంతం, గోదావరిఖనికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంలో ఒక మంచి పోలీస్‌స్టేషన్ ఆవశ్యకత ఉందని గుర్తించి అధునాతన పద్ధతిలో మోడల్ ఠాణాను నిర్మించడం మంచి పరిణామం. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో పోలీసు గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ కల్పిస్తున్న అనేక రకాల సౌకర్యాలను పోలీసులు సద్వినియోగం చేసుకొని ఫ్రెండ్లీ పోలీసు, పీపుల్ పోలీసుగా గుర్తింపు పొందాలి. నిర్మాణాలకు ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు చేయూత అందించడం అభినందనీయం. పోలీసులు ప్రజలతో మమేకమై ఒక మంచి వాతావరణంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో పాలుపంచుకోవాలి.
– మహేందర్‌రెడ్డి, డీజీపీ