చొప్పదండి, సెప్టెంబర్ 6 : రుక్మాపూర్ సైనిక్ శిక్షణ పాఠశాల పేరుకే ఉందని విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో సహా కేవలం ఐదుగురు ఉన్నారని మండిపడ్డారు. పాఠశాలలో వెంటనే సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ చైర్మన్ శంకర్ మాట్లాడుతూ, పాఠశాలలో ఒక ఆర్మీ శిక్షణ అధికారి, 19 మంది స్టాఫ్ ఉండాలని, ఇప్పు్పడు అరకొర సిబ్బంది, ఒక ప్రిన్సిపాల్‌తో పాఠశాల నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆర్మీ శిక్షణ అధికారి, ఆర్మీ డైరెక్టర్ లేరని, తాతాలికంగా ఉన్న 19 మంది సిబ్బందికి ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఏకైక సైనిక్ పాఠశాల ఇలా ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అహర్నిశలు కష్టపడి పిల్లలను ఇందులో చేర్పిస్తే సిబ్బంది లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పిల్లల బాధలు వర్ణనాతీతమని అవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో డైరెక్టర్, ఆర్మీ శిక్షణ అధికారి లేకపోతే విద్యార్థులను దేశానికి సైనికులను ఎలా తయారు చేస్తారని, సీబీఎస్ఈ సిలబస్ పెట్టి ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులు ఎలా చదువుతారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను నియమించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఈ ఆందోళన విషయమై ప్రిన్సిపాల్ కాళహస్తి వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదు.
విద్యార్థులు నష్టపోతున్నరు
సైనిక్ శిక్షణ పాఠశాలలో ఆర్మీ శిక్షణ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చాలా నష్టపోతున్నరు. సిబ్బందికి ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా తొలగించడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నరు. తెలంగాణ ప్రభుత్వం సైనిక్ శిక్షణ పాఠశాలను తీసివేసేందుకు కుట్ర పన్నుతున్నది. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి.
– నరేశ్, పేరెంట్స్ కమిటీ కార్యదర్శి (వరంగల్)