కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా 2011 జూన్ 6న ఆవిర్భవించిన ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ నాటి నుంచి నేటి వరకు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నది. అనునిత్యం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ.. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ముందుకు సాగుతోంది. ఆరంభంలో ప్రజల కాంక్షకు అద్దంలా నిలిచి, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను చాటింది. ఆంధ్రా పత్రికల కుతంత్రాలు, కుళ్లు రాతలను బహిర్గతం చేసి, ఆంధ్రా పాలకుల కుట్రలను ఎండగట్టి.. ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకపోవడంలో కీలక భూమిక పోషించింది. స్వరాష్ట్రం సాధించిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు హయాంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నది.
అన్నివర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యేందుకు ఒక వారధిలా నిలిచింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఫల్యాలను ఎండగడుతున్నది. ఆ పార్టీ అనుక్షణం పత్రికాస్వేచ్ఛను హరించేందుకు యత్నిస్తున్నా లెక్కచేయకుండా ప్రజా సమస్యలను ముందుంచుతున్నది. ఇటు అవినీతి జలగల భరతం పడుతున్నది. అక్రమాలు, అన్యాయాలు, భూకబ్జాలు, ఇసుక దందాలు, నిధుల దుర్వినియోగం, పక్కదారి పట్టిన పోలీస్ వ్యవస్థ, భూ సమస్యలను జఠిలం చేస్తున్న రెవెన్యూ యంత్రాగం, పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు జరుగుతున్న అడ్డగోలు దోపిడీ, మెడికల్ మాఫియా దందాలు, ప్రభుత్వ శాఖల్లో జరిగిన అక్రమాలను బహిర్గతం చేస్తూ ఎన్నో కథనాలను ప్రచురించింది.
రాజన్న ఆలయ పరిధిలో జరిగిన రాజకీయం, కొండగట్టు అంజన్నకు అటవీశాఖ నోటీసులు, సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు జరిగిన కుట్రలతోపాటు రైతులకు జరిగిన అన్యాయంపై భిన్నమైన కథనాలను వెలువరించి వారికి అండగా నిలిచింది. యూరియా లేక అన్నదాతలు పడిన అగచాట్లు, రుణమాఫీ పేరిట జరిగిన మోసాలను ఆధారాలతో సహా ఎండగట్టి.. బాధితుల పక్షాన నిలిచింది. ఒకటి రెండు కాదు, పీడిత, బాధిత వర్గాల ప్రజలకు అడుగడుగునా అండగా నిలుస్తూ.. ఎన్నో అంశాలపై విశ్లేషణాత్మక కథనాలను కళ్లకు కట్టినట్టు ప్రచురించి ప్రభుత్వాన్ని కదిలించి స్పందించేలా చేసింది. అందులో కొన్నింటిని నేడు, రేపు మీ ముందుకు తెస్తున్నది.
బడా రైస్‌మిల్లర్లు ఒక గ్యాంగుగా ఏర్పడి సాగిస్తున్న అక్రమాలు, అధిక బియ్యం కేటాయింపులు.. ఇతర అంశాలను ఎండగడుతూ ‘నమస్తే తెలంగాణ’ 2025 డిసెంబర్ 6న ‘రైస్ మిల్లర్ల రగడ’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇది రైస్ ఇండస్ట్రీస్ రంగంలో కలకలం రేపింది. ఆ తర్వాత కూడా మెజార్టీ రైస్‌మిల్లర్లకు జరుగుతున్న అన్యాయం, వారిలో వ్యక్తమవుతున్న ఆక్రోశం, అసోసియేషన్‌లో సమావేశం, అది రచ్చరచ్చ కావడం ఇలా అంతర్గత అంశాలను వివరిస్తూ వరుస కథనాలతో సంచలనం సృష్టించింది.
కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. అక్టోబర్ 15న ‘టెన్త్ పేపర్స్ అమ్ముకున్నరు’ శీర్షికన కథనం ప్రచురించింది. తర్వాత ఎప్పటికప్పుడు ఒక్కో అక్రమాన్ని వెలుగులోకి తెస్తూ వరుస కథనాలు ప్రచురించడంతో యంత్రాంగం స్పందించింది. ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. సూపరింటెండెంట్ నరసింహస్వామిని సస్పెండ్ చేశారు.
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో సదరం సర్టిఫికెట్ల దందాను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. ‘సదరం సర్టిఫికెట్ రూ.30వేలు?’ శీర్షికన ఫిబ్రవరి 10న కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందించారు. బాధ్యులైన ఇద్దరు ఏజెన్సీ సిబ్బందిపై వేటు వేశారు. పీఆర్వోల వ్యవస్థను రద్దు చేశారు.
పెద్దప్లలి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 150 ఎకరాల స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించి చెరువుల చేపలను నిర్మించారు. బ్యాక్ వాటర్‌కు అడ్డుకట్టలు వేశారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ జూన్ 2న ‘ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందించారు. విచారణ జరిపి 17మంది అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు. చెరువులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
వేములవాడ రాజన్న ఆలయ కోడెలను అక్రమంగా కోతకు తరలించడంపై నమస్తే తెలంగాణ వరుస కథనాలతో బయటపెట్టింది. గతేడాది డిసెంబర్ 7న ‘కోడెలు కోతకు?!’ శీర్షికన ప్రచురించిన కథనం రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపింది. యంత్రాంగాన్ని కదిలించింది. మంత్రి సురేఖ సిఫారసు లేఖతో అనుచరుడు కోడెలను అమ్ముకున్నట్టు ఫిర్యాదు రాగా, పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చివరకు ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
సెప్టెంబర్‌లో యూరియా కోసం రైతులు అరిగోస పడ్డారు. ప్రభుత్వ ప్రణాళికాలోపంతో ఒక్క బస్తా కోసం రోజుల తరబడి తిరిగారు. నిత్యం గంటల తరబడి లైన్లలో నిల్చున్నారు. అయినా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి గానీ, జిల్లా మంత్రులు గానీ, ఎంపీలు గానీ పట్టించుకోలేదు. పైగా జిల్లాలో సమస్య ఉంటే హైదరాబాద్‌లో మంత్రులు సమావేశమై, యూరియా గురించి కాకుండా ఇతర సమస్యలపై చర్చించడం విమర్శలకు తావిచ్చింది. అప్పుడు ‘నమస్తే తెలంగాణ’ రైతుల గోసలను ఎప్పటికప్పుడు కండ్లముందుంచింది.
కొత్తపల్లి మండలంలోని బోనాలపల్లెకు అరకిలోమీటర్ దూరంలోనే ఫైరింగ్ శిక్షణ కేంద్రం ఉండడంతో భయంతో వణికిపోయింది. అప్పుడప్పుడు తూటాలు గ్రామంలోకి దూసుకురావడం, గ్రామస్తులకు తాకడం వంటి ఘటనలను వివరిస్తూ ‘నమస్తే తెలంగాణ’ 2025 సెప్టెంబర్ 23న ‘బోనాలపల్లెకు తూటా భయం’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించారు. ప్రత్యేకం బృందం గ్రామానికి వచ్చి, విచారణ చేపట్టింది.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్లో మెడికల్ మాఫియా మాయాజాలాన్ని ‘నమస్తే తెలంగాణ’ జూలైలో వరుస కథనాలతో బట్టబయలు చేసింది. మాఫియా గుప్పిట్లో కీలు బొమ్మలుగా మారిన అధికారుల తీరును ఎట్టగట్టింది. బ్రాండెడ్ కంపెనీల మందుల పేరిట నకిలీవి సృష్టించి మార్కెటింగ్ చేసుకుంటున్న ఫార్మా కంపెనీల తీరును ప్రజల ముంగిట నిలిపింది. ఈ కథనాలకు ప్రజల్లో అవగాహన పెరగడంతోపాటు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. డ్రగ్స్ కంట్రోల్ అధికారులపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఏడీని, ఇన్స్పెక్టర్ను పట్టుకుని దోషులుగా నిలబెట్టింది. అంతే కాకుండా ద్వితీయ శ్రేణి మందులు అమ్మిన కొందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
భూతల్లి ఒడిలో నల్లబంగారాన్ని వెలికితీసే కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యం విషయంలో సింగరేణి నిర్లక్ష్యం చేయడాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. జూన్ 13న ‘సింగరేణిలో మందుల కొరత’ శీర్షికన ప్రచురించిన కథనానికి యాజమాన్యం స్పందించింది. గోదావరిఖనిలోని సింగరేణి దవాఖానను పరిశీలించి, మందులను అందుబాటులోకి తెచ్చింది.
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు సంబంధించిన సొమ్మును ఉద్యోగుల సీపీఎస్ ఖాతాలో పది నెలలుగా సొమ్ము జమచేయలేదు. ఆ సొమ్మును ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకున్నది. దీనిపై నమస్తే తెలంగాణ ‘పది నెలలుగా జమకాని సీపీఎస్ సొమ్ము’ శీర్షికన నవంబర్ 28న కథనం ప్రచురించింది. ఇది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖను ఓ కుదుపు కుదిపేసింది. దీంతో వెంటనే గురుకుల ఉద్యోగుల సీపీఎస్ ఖాతాలో సొమ్మును జమ చేశారు.
జగిత్యాల నడిబొడ్డున రూ.వంద కోట్ల విలువైన మున్సిపల్ భూమి వివాదాస్పదంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ఇచ్చింది. మొదట నవంబర్ 3న ‘జగిత్యాల నడిబొడ్డున రూ.100 కోట్ల భూకబ్జా?’ శీర్షికన ఇచ్చిన కథనం సంచలనం రేపింది. తర్వాత కూడా వివాదస్పద భూమికి సంబంధించిన ఒక్కో అంశాన్ని వెలుగులోకి తేవడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటు అధికారులను కదిలించింది. 20 గుంటల భూమిపై విచారణ జరిగింది. వివాదాస్పదంగా మారిన పెట్రోల్బంక్తోపాటు ఇతర భవన సముదాయాలను రెవెన్యూ, మున్సిపల్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పరిశీలించారు. సమగ్ర నివేదిక రూపొందించారు. అయితే ఆ నివేదిక ఓ ప్రజాప్రతినిధి, అధికారుల ఒత్తిడితో కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్టు తెలిసింది.
సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌లోని ఇండ్ల జాగలన్నీ ఓ తహసీల్దార్ తప్పిదంతో ప్రొహిబిషన్ లిస్టులోకి వెళ్లడంతో దాదాపు 280 కుటుంబాలు అరిగోస పడ్డాయి. పదిహేడేండ్లు నరకం చూశాయి. ఈ గోసను వివరిస్తూ గతేడాది జూలై 4న ‘అమ్మరాదు.. కొనరాదు’ శీర్షికన నమస్తే తెలంగాన కథనం ప్రచురించింది. దీనిపై కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించారు. భూముల క్రయవిక్రయాలకు హక్కులు కల్పించారు.
ప్రజాపాలన విజయోత్సవాల పేరిట గతేడాది నవంబర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీలు వచ్చారు. అప్పుడు సీఎంతోపాటు వంద మందికి భోజనాల కోసం అక్షరాల రూ.32 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే ఒక్కొక్కరికి రూ.32వేలు! అలాగే ఒక్కో పట్టు పంచెకు రూ. 10వేలు ఖర్చు పెట్టారు. మొత్తంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భోజనాలు, ఇతర వస్తువుల కోసం రూ.కోటీ 70లక్షలు ఖర్చు పెట్టినట్టు సమాచారం. దీనిని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. గతేడాది డిసెంబర్ 16న ‘ప్లేటు భోజనం 32 వేలు’ శీర్షికన ప్రచురించిన కథనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.