జీవితాన్ని మార్చిన దళిత బంధు పథకం
ఆర్థికంగా ఎదుగుతున్న దళిత కుటుంబం
నెలకు రూ.15 వేల ఆదాయం పొందుతున్న కొమురమ్మ
వీణవంక, ఫిబ్రవరి 16;దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి శాశ్వతమైన సుస్థిరత కలుగజేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న దళిత బంధు పథకం సత్ఫలితాలనిస్తున్నది. కూలీ పని నుంచి ఒక కుటుంబం వ్యాపారులుగా ఎదుగుతుంటే, పాలేరు పని నుంచి ఓనర్‌గా మరో కుటుంబం.. ఇలా ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు దళితజాతి యావత్త్తూ జేజేలు కొడుతున్నది. ఎప్పటికీ కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నది. మొదట ఇద్దరితో ప్రారంభమైన దళితబంధు ఇప్పటి వరకు 160 కుటుంబాలను ఆర్థిక సుస్థిరతవైపు నడిపించింది.
ఈమె పేరు ఎల్కపెల్లి కొమురమ్మ, ఈమెది చల్లూరు గ్రామం. వీణవంక మండలం. కొమురమ్మ-రాజయ్య దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కొడుకులు. వీరికి గుంట భూమి కూడా లేకపోవడంతో కూలీ నాలీ చేసి పిల్లల్ని సాదుకున్నారు. ఆడపిల్లలకు పెండ్లిళ్లు చెయ్యాలని కొమురమ్మ భర్త రాజయ్య కరీంనగర్‌లోని ఓ హోటల్లో కూలీ పనికి చేరగా, కొమురమ్మ రోజువారీ కూలీ పనికి పోయి పైసాపైసా కూడేసి, కొంత అప్పుదెచ్చి ముగ్గరు బిడ్డలకు పెండ్లిళ్లు చేసింది. కొడుకులకు ఆస్తిపాస్తులు లేవని ఓ ఇంటోళ్లను ఎలా చెయ్యాలని కొమురమ్మ దంపతులు కుమిలిపోయేవారు. కుటుంబం గడువక కొమురమ్మ ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్మేది. ఇందులో మిగిలిన రూ.200 తీసుకొని వచ్చి ఇంట్లకు వంట సామాను కొనుక్కునేది. భర్తకు వచ్చే జీతం డబ్బులు అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోయేది. వారి కొడుకులను కూడా కూలీ పనికి పంపితే కాని కష్టాలు తీరవనుకొని బాధపడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు.
కన్నీటి జీవితాన్ని గడుపుతున్న కొమురమ్మ కుటుంబంలో దళిత బంధు పథకం కొత్త వెలుగులు నింపింది. దళితులకు ఈ పథకం ద్వారా రూ.10 లక్షలు ఇస్తున్నారని తెలిసి కరీంనగర్ నుంచి సొంత ఊరికి పయనమైంది. నిరుపేదలకు దళితబంధు యూనిట్ల పంపిణీలో వీణవంక మండలంలోని చల్లూరు గ్రామం నుంచి ఎల్కపెల్లి కొమురమ్మ ఎంపికైంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధు పథకం ప్రారంభం రోజు ట్రాక్టర్‌ను తీసుకుంది. ఆనందంతో వారి కుటుంబ సభ్యుల కళ్లల్ల్లో నీళ్లు తిరిగాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొమురమ్మ కుటుంబ సభ్యులు ఆలోచన చేశారు. పెద్ద కొడుకు రాజశేఖర్‌కు ట్రాక్టర్ నడుపరావడంతో గ్రామంలో ఉన్న సాండ్ రీచ్‌లో ట్రాక్టర్‌ను పెట్టారు. మధ్య, మధ్యలో వ్యవసాయ పనులు, మట్టి జారగొట్టడం వంటి పనులతో ట్రాక్టర్‌కు ఓనర్‌గా, వ్యాపార వేత్తగా ఎదుగుతున్నారు. నెల తిరిగే సరికి రూ.15 వేలు సంపాదిస్తున్నారు. వారు ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో కొమురమ్మ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక సుస్థిరతను పొందింది.
ఆర్థిక స్వావలంభన దిశగా 160 కుటుంబాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా మండలంలో ఇప్పటి వరకు 160 కుటుంబాలు యూనిట్లు తీసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రెండు యూనిట్లు (ట్రాక్టర్లు) మంజూరు కాగా, 156 డైరీ యూనిట్లు, రెండు హార్వెస్టర్లు మంజూరయ్యాయి. మరో 800 యూనిట్ల లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చారు. వాహనదారులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు, వారితో పాటు ఇతర యూనిట్లు పెట్టుకున్న వారికి గ్రౌండింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.