2017లో శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
మూడున్నరేళ్లలోనే అన్ని వసతులతో పూర్తి
పల్లె ముంగిట్లోకి చేరువైన పాలన
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ);కొత్త జిల్లాగా పురుడుపోసుకున్న కార్మిక క్షేత్రం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పడ్డ జిల్లా పల్లె ముంగిట్లోకి చేరువైంది. 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకు స్థాపన చేయగా, మూడున్నరేళ్లలోపే కార్యరూపం దాల్చింది. నాడు అద్దె భవనంలో సాగిన పరిపాలన నేడు అధునిక హంగులతో సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో సమస్యలతో కునారిల్లిన పల్లెలకు పరిష్కారం లభించింది.
2016లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కాగా, మొదట సిరిసిల్ల పట్టణంలోని సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) కార్యాలయంలో తాత్కాలికంగా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త జిల్లాల కు కలెక్టరేట్లు ఉండాలన్న ఆలోచన మేరకు 2017 లో ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. సుమారు మూడున్నరేళ్లలోపే కార్యరూపం దాల్చిం ది. గతేడాది మార్చి 4న తిరిగి ఆయనే ప్రారంభించారు. 56 శాఖలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఒకే చో ట నిర్మించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పాయి.
92 ఎకరాల్లో కలెక్టరేట్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని 92 ఎకరాల్లో 64.7 కోట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దారు. బైపాస్ రోడ్డులో 2017 నవంబర్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించగా, అత్యాధునిక హంగులతో పూర్తి చేశారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు స్వయంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన కలెక్టరేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, అన్ని మండలాల అధికారులు, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జీ+2 పద్ధతిలో నిర్మించిన ఈ భవన సముదాయాన్ని ఏ, బీ, సీ, డీ బ్లాకులుగా విభజించి, మొత్తం 56 శాఖలకు గదులు కేటాయించారు. 800 మంది కూర్చుండేలా విశాలమైన సమావేశ మందిరం నిర్మించారు. భవనంపై రెండంతస్తులకు వెళ్లడానికి మూడు వైపులా మెట్లతో పాటు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి అయిదు అంతస్తులకు పెంచుకునేలా ఏర్పాటు చేశారు. సమీకృత కలెక్టరేట్ చుట్టూ 30 ఫీట్ల రోడ్లు, జంక్షన్లు, పార్కులు, ఏర్పాటు చేశారు. భవనం గ్రౌండు ఫ్లోర్లో అధికారులు, సిబ్బంది కోసం వంద వరకు వాహనాలను పార్కింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. బయటి నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.
చేరువలో పాలన
గతంలో ఉమ్మడి జిల్లా అయిన కరీంనగర్లో పరిపాలన సాగేది. దీంతో అధికారులను కలువాలన్నా, కలెక్టర్‌కు సమస్యలు ఏకరువు పెట్టుకోవాలన్నా దూరభారం కావడం, అంత దూరం వెళ్లినా అధికారులు ఉంటారన్న నమ్మకం లేక పోవడం జరిగేది. వారానికి ఒక రోజు జరిగే ప్రజావాణిలో వినతి పత్రాలు ఇస్తే అవి పరిష్కారమయ్యేదాకా కరీంనగర్‌కు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రానికి గంభీరావుపేట మండలం 80 కిలోమీటర్లు, అటవీ ప్రాంతాలైన మర్రిమడ్ల 85 కిలోమీటర్లు, ముస్తాబాద్ 60 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల వద్దకే పాలన చేరింది. కింది స్థాయి అధికారులతో పనులు కాకపోతే కలెక్టర్‌ను ప్రతి సామాన్యుడు కలిసే అవకాశం ఏర్పడింది. అధికారులు బాధ్యతతో పనిచేస్తున్నారు. జిల్లా పరిధిలో 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలుండగా, జిల్లా కేంద్రానికి గంభీరావుపేట 40 కిలోమీటర్లు, ముస్తాబాద్ 22, రుద్రంగి 40 కిలోమీటర్లు ఉన్నది. అంటే జిల్లా కేంద్రానికి ఏకంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గింది.
పెరిగిన జావాబుదారీ తనం
జిల్లా ఏర్పాటుతో ఉన్నతాధికారులు అందుబాటు లో ఉంటున్నందున స్థానిక అధికారుల్లో జవాబుదారీతనం పెరిగింది. విధులకు డుమ్మా కొట్టే అధికారులు భయం.. భక్తితో పనిచేస్తున్నారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్‌కు రోజూ వెళ్లి వచ్చేవారే ఎక్కువగా ఉండగా, ఇ ప్పుడు స్థానికంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
పకడ్బందీగా పథకాల అమలు
ప్రస్తుతం ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు అందే అవకాశాలు ఎక్కువున్నాయి. గతంలో జిల్లా అధికారులు అందుబాటులో లేక అధికారులు, ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రేషన్ సరుకులు కూడా పక్కదారి పట్టిన సందర్భాలున్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పింఛన్లు, తదితర సమస్యలకు ఎటు వెళ్లాలో సామాన్యులకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడా పరిస్థితి లేదు. స్థానిక అధికారుల పనితీ రు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశాలు పెరిగాయి. ప్రతి సామాన్యుడు కలెక్టర్‌ను కలిసే అవకాశం ఏర్పడింది.
జడ్పీ మీటింగ్ ఇక్కడే..
గతంలో జడ్పీ మీటింగ్‌లు అప్పటి జిల్లా కేంద్రమైన కరీంనగర్లో జరిగేవి. అప్పుడు సిరిసిల్ల పరిధిలోని 9 మండలాల నుంచి జడ్పీటీసీలు వెళ్లేవారు. కానీ, ఇక్కడి సమస్యలు చెప్పుకునే అవకాశం చాలా తక్కువగా ఉండేది. జిల్లా ఏర్పడ్డ తర్వాత సమావేశాలు ఇక్కడే జరుగుతుండడంతో వారి పరిధిలోని సమస్యలపై మాట్లాడే అవకాశం లభించింది.