జగిత్యాల, ఫిబ్రవరి 19 : దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ఛత్రపతి శివాజీ మహరాజ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కొనియాడారు. శనివారం శివాజీ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని 29వ వార్డులో ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి, మాట్లాడారు. శివాజీ ధీరత్వం, పోరాట పటిమ, రాజనీతి, పరిపాలన దక్షత అందరికీ ఆదర్శమన్నారు. శివాజీ మహరాజ్ తెలుగు రాష్ర్టానికి వచ్చినప్పుడు అమ్మవారికి పూజలు చేయడం, ఆయనకు అమ్మవారు ఖడ్గం బహూకరించడం చరిత్ర తెలియజేస్తుందన్నారు. ఒక హిందువుగా గర్విస్తూనే ఇతర మతాలను గౌరవించడం మన సాంప్రదాయమన్నారు. శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఆదర్శాలను అనుసరించాలని కోరారు. ఇక్కడ కౌన్సిలర్లు పంబాల రాము, తోట మల్లికార్జున్, బొడ్ల జగదీష్, ఆవారి శివకేసరి బాబు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, నాయకులు పాల్గొన్నారు.