హుజూరాబాద్, సెప్టెంబర్ 6 : నియోజకవర్గంలోని దళితులను అణచివేసి బీజేపీ నేత ఈటల రాజేందర్ రాక్షసానందం పొందారని, ఆయన వికృత చేష్టలకు ఎన్నో కుటుంబాలు బలయ్యాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీసెంటర్హాల్లో మరో విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, సండ్ర వెంకటవీరయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఓటమిభయంతో, డబ్బు అహంకారంతో దళిత ఎమ్మెల్యేలను ఈటల రాజేందర్ కించపరిచేలా మాట్లాడిన విధానాన్ని ఖండించారు. అంబేద్కర్ భావజాలం, కమ్యూనిజ వాదం, ఫూలే విధానం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అని చెప్పిన ఈటల వీటికి విరుద్ధమైన పార్టీలో చేరి దళితుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి హరీశ్‌రావుపై పరుష పదజాలం వాడిన తీరును మేధావులు గమనించాలని కోరారు. దళిత ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ ఓటమి ఖాయమని, దానిలో ఎవరికీ అనుమానం లేదని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో దళిత జాతి ఊరుకోదని, అనంతరం జరిగే పరిణామాలకు తమ బాధ్యత ఏమీ ఉండదన్నారు. ఉప ఎన్నికలు అంటేనే భిన్న పరిస్థితులుంటాయని, ప్రచారం చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుంచి వస్తారని, ఇది అన్ని పార్టీల వాళ్లకూ వర్తిస్తాయన్నారు. గతంలో ఈటల కూడా ఇతర నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. దళితులకు కూడా ఆత్మగౌరవం ఉంటుందనే విషయం మరచిపోవద్దని హితవుపలికారు. గెల్లు శ్రీనివాస్ ఉద్యమంలో అనేక కేసులు మీద వేసుకున్నాడని, ఆయనను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దళిత వాడలకు వస్తే తరిమికొట్టాలి : విప్ గువ్వల
దళిత ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ నేత ఈటల రాజేందర్ దళిత వాడలకు వస్తే తరిమికొట్టాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. దళితుల జీవితాలు మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఈటలకు రెండేళ్ల క్రితం చెప్పాడని, దీనికోసం ఎస్సీ శానసభ్యులు, ఎంపీలతో సమావేశాలు పెట్టి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారన్నారు. రెండేళ్ల క్రితమే దళితబంధుకు అంకురార్పణ జరిగేదని, అయితే ఏ రోజూ ఈటల రాజేందర్ పిలువలేదని, కనీసం దాన్ని పట్టించుకున్నపాపాన పోలేదన్నారు. కానీ తన వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ దగ్గరికి పలుమార్లు వెళ్లిన సంగతి గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని తన స్వార్థం కోసం వాడుకొని ప్రజల మనోభావాలు దెబ్బతీసిన ఈటల రాజేందర్‌ను భూస్థాపితం చేయాలని, సీఎం కేసీఆర్ పంపిస్తే ఇక్కడికి వచ్చామని, ఈ నియోజకవర్గం కేసీఆర్ అచ్చివచ్చింది గనుక ఎట్టి పరిస్థితుల్లో ఈటలను ఓడించడం ఖాయమన్నారు. దళితులపై ప్రవర్తన మారకపోతే వెంటాడి వేటాడుతామని హెచ్చరించారు. నమస్కారం పెడితే కనీసం ప్రతి నమస్కారం పెట్టని సంస్కారహీనుడని, సోషల్ మీడియాను నమ్ముకొని ప్రచారం చేస్తున్నాడు తప్ప ప్రజలు ఆయన వెంట లేరని తెలుసుకోవాలని హితవుపలికారు. సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు పోల్నేని సత్యనారాయణరావు, మొలుగు పూర్ణచందర్, తొగరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈటల రాజేందర్ సంస్కారహీనుడు : ఎమ్మెల్యే అరూరి
దళిత ఎమ్మెల్యేలను ‘దద్దమ్మ నా కొడుకులు’ అని సంబోధించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ సంస్కారహీనుడు అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మండిపడ్డారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన ఈటలకు సంస్కారం ఉంటుందని అనుకున్నానని, అయితే, ఆయన వ్యవహార శైలి చూస్తే మొత్తం భిన్నంగా ఉందన్నారు. రాజేందర్ మేక వన్నె పులి అని, మీదికి నవ్వుకుంటూ మాట్లాడుతాడని.. దళితులంటే ధ్వేషమని చెబితే నమ్మలేదని, ఇప్పుడు ఆయన అసలు రంగు బయటపడిందన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే ఆయన నిజస్వరూపం స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ‘ఈటల రాజేందర్ ఖబడ్ధార్… నిన్ను దళిత వాడలకు రానిచ్చేదే లేదు’ అని హెచ్చరించారు.