146 మంది హుజూరాబాద్ లబ్ధిదారులకు 63 యూనిట్లు గ్రౌండింగ్
ఉమ్మడి యూనిట్లుగా హార్వెస్టర్లు, ఎక్స్కవేటర్లు, ట్రాక్టర్లు, వ్యాన్లు
కరీంనగర్ వేదికగా మంత్రులు కొప్పుల, గంగుల పంపిణీ
దళితుల కుటుంబాల్లో ఆనందం
కరీంనగర్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ);దళితలోకం సంబురపడుతున్నది. దగా పడ్డ జీవితాల్లో వెలుగులు నింపే బృహత్తర పథకం దళిత బంధు దిగ్విజయంగా అమలవుతుండడంతో కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నది. ఇప్పటికే హుజూరాబాద్ సెగ్మెంట్‌కు సంబంధించి పథకం ఫలాలతో వందలాది మంది జీవితాలు నిలబడగా, తాజాగా మరో 63 యూనిట్లను సర్కారు మంజూరు చేసింది. శనివారం కరీంనగర్ వేదికగా లబ్ధిదారులకు రూ.15కోట్ల విలువైన హార్వెస్టర్లు, ఎక్స్కవేటర్లు, ట్రాక్టర్లు, వ్యాన్లు అందించగా, వాహనాలను చూసి దళితబిడ్డలు మురిసిపోయారు. ఇన్నేండ్ల కష్టాలు.. కన్నీళ్లను తలుచుకుంటూ.. ఉద్వేగానికి లోనయ్యారు. పథకం కింద బండ్లు వచ్చాయని, అవే తమ బతుకులకు భరోసానిస్తాయని, ఇక తమ జీవితానికి ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేశారు. బతికున్నంతకాలం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్నాళ్లూ కాయకష్టం చేసుకుని ఎల్లదీసిన బతుకులవి. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకున్నా నయాపైసా వెనుకేసుకునే పరిస్థితి లేని జీవితాలవి. కూలీ నాలీ చేసుకుని కుటుంబాలను నెట్టుకొచ్చిన దళితుల బతుకుల్లో సీఎం కేసీఆర్ చూపుతున్న ఆదరణతో వెలుగులు నిండుతున్నాయి. ఇన్నాళ్లూ హార్వెస్టర్లు, జేసీబీలు, కార్ల డ్రైవర్లుగా పనిచేసిన వాళ్లు ఇపుడు ఓనర్లవుతున్నారు. పాడి యూనిట్లు నెలకొల్పుకొని ఉత్పత్తిలో భాగస్వామ్యులవుతున్నారు. ఇలా ఏ ఒక్కరో.. ఇద్దరో కాదు, హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు యూనిట్లు పొందుతున్న దళిత కుటుంబాలు సంబురంలో మునిగితేలుతున్నాయి. అండగా నిలిచిన సర్కారుకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెబుతున్నాయి.
తల్లి, కొడుకులు కలిసి..
..పక్క చిత్రంలో కనిపిస్తున్న తల్లీకొడుకుల పేర్లు శ్రీరాం లక్ష్మి, స్వామి. ఊరు వీణవంక మండలం బేతిగల్. ఉమ్మడిగా హార్వెస్టర్ యూనిట్‌ను ఎంచుకున్నారు. స్వామి కొన్నేళ్లు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2003 నుంచి హార్వెస్టర్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తున్నాడు. వీటి నిర్వహణతో వచ్చే లాభాలను ప్రత్యక్షంగా చూసిన స్వామి తాను కూడా ఒక హార్వెస్టర్ కొనుక్కోవాలని అనుకున్నాడు. కానీ, వచ్చిన సంపాదనంతా పొట్టకే సరిపోవడంతో డ్రైవర్‌గానే మిగిలిపో యాడు. ఇప్పుడు దళిత బంధు పథకంతో అతని చిరకాల వాంఛ తీరింది. స్వామి హార్వెస్టర్‌కు యజమానైండు. ఇక నుంచి ఆయన కష్టపడి సంపాదించుకునేది ఆయనకే మిగులుతుంది. ఈ సందర్భంగా స్వామి తల్లి లక్ష్మి మాట్లాడుతూ తాము కడునిరుపేదలమని, తన కొడుకు వరికోసే మిషిన్ కొనుక్కోవాలని ఏండ్ల సంది అనుకుంటున్నాడని, మన ఇల్లు, భూములు అమ్మినా రాదని తాను చెప్పేదానినని, కానీ ఇపుడు కేసీఆర్ దయతో బండి రావడం సంతోషంగా ఉందని చెప్పింది.
చాలా సంతోషంగా ఉంది..
కేసీఆర్ సార్ ఇచ్చిన దళిత బంధు పైసలతోని మా అల్లుడు నేను కలిసి హార్వెస్టర్ కొనుక్కున్నం. మా కొడుకు ప్రవీణ్ ఇదే బండి నడుపుతడు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. కూలీ పని చేసుకుని బతికెటోళ్లం ఇపుడు బండికి ఓనర్లయినం. మా కొడుక్కు ఒక పని దొరికినట్టు ఉంటది. అందరం కలిసి మంచిగ పనిచేస్కొని మంచిగ ఉంటం. మా ఊరిల వరి కోతలు మస్తుంటయ్. అపుడు మంచి గిరాకీ అయితది. ఇంత మంచి పథకం ఇచ్చిన కేసీఆర్ సార్‌కు చానా రుణపడి ఉంటం.
– కప్పల భాగ్య, శాయంపేట (జమ్మికుంట మండలం)
తండ్రి కొడుకులు ఒక్కటై..
హుజూరాబాద్ మండలం రాజాపల్లికి చెందిన మ్యాకల లింగయ్య అతని చిన్న కొడుకు అనిల్ కలిసి హార్వెస్టర్ కొనుగోలు చేసుకున్నారు. ఓ ఆసామి వద్ద హార్వెస్టర్ నడిపిన అనుభవం ఉన్న లింగయ్య ఇప్పుడు తానే హార్వెస్టర్‌కు యజమాని అయ్యాడు. ఇక తాను కష్టపడి కుటుంబాన్ని బాగా పోషించుకుంటానని చెబుతున్న లింగయ్య, ఈ యంత్రాన్ని పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాడు. సీఎం కేసీఆర్ అంటే మా పాలిట దేవుడని చెబుతున్నాడు. తనకు ఇద్దరు కొడుకులని, చదువుకున్నా ఉద్యోగాలు లేక, కూలీ నాలీ చేసుకుని బతుకుతున్నారని, ఈ మిషన్‌తో వాళ్లకు ఇంత ఉపాధి దొరుకుతుందంటూ సంబురపడుతున్నాడు. పెద్ద కొడుకు పేరిట కూడా మరో యూనిట్ స్థాపించుకుని తమ కుటుంబాన్ని ఆర్థికంగా బలంగా చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న లింగయ్య, సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేదని చెబుతున్నాడు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా చారిత్రక దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇల్లందకుంటలో 2,120, హుజూరాబాద్ రూరల్‌లో 2,633, హుజూరాబాద్ మున్సిపల్లో 1,570, జమ్మికుంట రూరల్‌లో 2,306, జమ్మికుంట మున్సిపాలిటీలో 2,036, వీణవంకలో 2,993, కమలాపూర్‌లో 3,896 చొప్పున 17,554 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందించేందుకు రూ.1,737,86 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కారు, ఇప్పటి వరకు 1,195 మంది లబ్ధిదారులకు రూ.119.50కోట్ల విలువైన యూనిట్లను పంపిణీ చేసింది. అయితే యూనిట్ల గ్రౌండింగ్ జిల్లా యంత్రాంగం వేగవంతం చేయడంతోపాటు మెగా మేళాలు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగానే శనివారం రెండోసారి కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ 146 మందికి రూ.15.30 కోట్ల విలువైన 63 యూనిట్లను పంపిణీ చేశారు.
వేగంగా గ్రౌండింగ్ చేస్తున్నాం..
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్‌ను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటి వరకు 1,086 యూనిట్లను 1,195 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశాం. ఈ రోజు (శనివారం) గ్రూపు యూనిట్లు గ్రౌండింగ్ చేశాం. వచ్చే వారంలో వ్యక్తిగత యూనిట్లు గ్రౌండింగ్ చేస్తాం. సుమారు 1,500 యూనిట్ల వరకు ఉండవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. జాబితాలో ఎంపిక చేసిన ప్రతి దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సాయం అందిస్తాం. లబ్ధిదారులు అనుభవం ఉన్న, మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంచుకునే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నాం. అవగాహన, శిక్షణ కల్పిస్తున్నాం. ప్రతి శుక్రవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి గ్రౌండింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. క్లష్టర్ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎక్కడాలోపాలు లేకుండా గ్రౌండింగ్ జరిగే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. – డీ సురేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
కేసీఆర్ కారణ జన్ముడు..
కేసీఆర్ నిజంగా కారణ జన్ముడే. ఆయనే లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఆయనే లేకుంటే మా దళితుల బతుకులు బాగుపడేవి కాదు. ఇంత మంచి పథకం తెచ్చి మాకు అండగా నిలబడ్డ కేసీఆర్ సార్‌కు ఏమిచ్చినా రుణం తీరదు. చీకటిలో ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నరు. కేసీఆర్ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతది. ఆయన తీసుకున్న దళిత బంధు పథకం మా జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇంత మంచి పథకం గురించి దేశంలో ఏ ఒక్క సీఎం కూడా ఆలోచించ లేదు. ఇలాంటి పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలే. నా ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్‌ను మర్చిపోను. నా కుటుంబం కూడా మర్చిపోదు.
– తప్పెట రమేశ్, వీణవంక మండల దళిత బంధు కన్వీనర్
ఆదర్శం.. ఈ ఐదుగురు మహిళలు
..కింది చిత్రంలో విజయ సంకేతం చూపుతున్న ఈ ఐదుగురు మహిళలు అంబాల రాధ, శనిగరం పద్మ, దాట్ల స్వరూప, దాట్ల స్వప్న, రమల్ల సునీత. వీరందరిదీ హుజూరాబాద్ మండలం చెల్పూర్. చాలా నిరుపేద కుటుంబాలు. కూలీ పనిచేస్తేనే గానీ పూటగడిచేది కాదు. అయితే దళితబంధు వీరి జీవితాలకు వెలుగు రేఖగా నిలిచింది. రాష్ట్ర సర్కారు ఉమ్మడి యూనిట్లకు అవకాశం ఇవ్వడంతో ఐదుగురు గ్రూపుగా ఏర్పడ్డారు. హుజూరాబాద్, అటు జమ్మికుంట పట్టణాలకు మధ్యలో ఉన్న చెల్పూర్లో ఎర్త్ మూవర్ ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఐదుగురికి రూ.50 లక్షలు వచ్చాయి. ఒకే యూనిట్ కింద రూ.32 లక్షలు వెచ్చించి ఒక ఎక్స్‌కవేటర్‌ను, రూ.18 లక్షలు వెచ్చించి రెండు ట్రాక్టర్లను శనివారం అధికారులు అందించగా, వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిన్న మోటార్ సైకిల్ కొనాలంటేనే ఆలోచించే ఈ కుటుంబాలకు ఇప్పుడు దళితబంధు ద్వారా రూ. 50 లక్షల విలువ చేసే ఒక ఎక్స్కవేటర్, రెండు ట్రాక్టర్లు సమకూరడంతో ఆనందంలో మునిగిపోయారు. కష్టపడి పని చేసుకుని ఆర్థికంగా ఎదుగుతామని ఆ ఐదుగరు మహిళలు ధీమాగా చెబుతున్నారు. తమకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు జన్మంతా రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న వీరిని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేకంగా అభినందించారు.