ఇల్లందకుంట రూరల్, అక్టోబర్ 10: దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులంతా తమకు నచ్చిన వ్యాపారంలో రాణించి వ్యాపారవేత్తలుగా ఎదగాలని దళితబంధు మండల ఇన్చార్జి సరిగొమ్ముల మనోహర్ ఆకాంక్షించారు. ఆదివారం మండలంలోని సిరిసేడు గ్రామంలో దళితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, దళితుల జీవితాలు బాగుపడేలా సీఎం కేసీఆర్ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించడం గొప్పవిషయమని, ఇందుకు మనమంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలని కోరారు. ఇప్పటికే దళితబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మనమంతా అండగా నిలిచి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత చాటాలని కోరారు. కార్యక్రమంలో దళితబంధు సభ్యులు మోతె మహేందర్, సరిగొమ్ముల సుకుమార్, సోమిడి కరణ్, బీఆర్ యశ్వంత్‌కుమార్, డీ సంపత్, ఎంపీటీసీ రేణికుంట్ల చినరాయుడు, భవన కార్మిక సంఘం నాయకులు రేణికుంట్ల సారయ్య, తారకరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన దళితుల ఆత్మగౌరవం: బత్తుల తిరుపతి
సీఎం కేసీఆర్ దళితబంధు పథకంతో దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల తిరుపతి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. ఆదివారం పలు గ్రామాల్లో తిరుపతి ప్రచారం నిర్వహించారు. దళితబంధుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ పథకంతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. దళితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా మారాలని ఆకాంక్షించారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు కుమారస్వామి, శ్రావణ్‌కుమార్, సురేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.