కరీంనగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : దళితుల దశాదిశ మార్చే దళితబంధు పథకానికి ఈ నెల 16న శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేశారు. నియోజకవర్గంలోని దళితకుటుంబాలన్నింటికీ లబ్ధి చేకూరుస్తామని, అందుకు 2వేల కోట్లు ఖర్చయినా ఇస్తామని ప్రకటించారు. ఆ మాట ప్రకారంగానే ఇప్పుడు వెనువెంటే నిధులు విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న 500 కోట్లు రిలీజ్ చేయగా, సోమవారం మరో 500 కోట్లు విడుదల చేశారు. 24గంటల్లోనే.. ఇంకో 200 కోట్లు రిలీజ్ చేసి, దళితుల అభ్యున్నతిపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇటు నియోజకవర్గంలోని సుమారు 21 వేల దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంతటి బృహత్తరమైన పథకం పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంచుకోవడం, నిధులు కూడా వెనువెంటనే విడుదల చేస్తుండడంతో ఇక్కడి దళితులు సంబురాలు చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ తమకు ఇంత పెద్ద పథకాన్ని ఇచ్చిన ప్రభుత్వం లేదని, సీఎం కేసీఆర్ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సర్వేకు సిద్ధంగా..
దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ, సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా పర్యవేక్షణలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రతి రోజూ సమీక్షిస్తున్నారు. ప్రతి గ్రామానికి ఒక జిల్లా స్థాయి అధికారిని క్లస్టర్ ఆఫీసర్‌గా నియమించారు. హుజూరాబాద్ పట్టణంలో ముగ్గురు, జమ్మికుంటలో ఐదుగురు క్లస్టర్ అధికారులను నియమించారు. ఒక్కో క్లస్టర్ ఆఫీసర్‌కు అక్కడి దళితుల జనాభాను బట్టి రెండు నుంచి మూడు బృందాలను కూడా నియమిస్తున్నారు. ఒక్కో గ్రూపు ప్రతి రోజూ 150 నుంచి 200 కుటుంబాలను సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి ఈ సర్వే ప్రారంభించే అవకాశమున్నది. లబ్ధిదారుల గుర్తింపునకు పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో కలెక్టర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. సర్వే సమయంలో దళితులతో మర్యాదగా వ్యవహరించాలని ప్రత్యేకంగా చెబుతున్నట్లు తెలుస్తున్నది. మంచి పనితనం కనబర్చే ఉద్యోగులతోపాటు స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల సహకారాన్ని కూడా అధికారులు తీసుకోబోతున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచాయతీల్లో అయితే గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో అయితే వార్డు సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించి ఆమోదం పొందుతారు. మరో పక్క తెలంగాణ దళిత బంధు పేరిట ఖాతాలు తెరవాలని నియోజకవర్గంలోని అన్ని బ్యాంకుల మేనేజర్లకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియను ఐదు రోజుల్లో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎలాంటి యూనిట్లు లాభదాయకం..
దళితబంధు కింద ఒక్క రూపాయి కూడా వృథా కావద్దనే లక్ష్యంతో అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఎలాంటి యూనిట్లు నెలకొల్పితే మంచి ఆదాయం వస్తుందనే విషయంలో కలెక్టర్ కర్ణన్ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దళితబంధు కింద ఐదు మండలాల పరిధిలో 15 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా, అందులో జిల్లాకు చెందిన 12 మంది లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఎవరెవరు ఎలాంటి యూనిట్లు నెలకొల్పుకునేది వారి ఇష్టానికి వదిలేసినా అనుభవమున్న రంగంలో యూనిట్లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇది వరకు ఎంచుకున్న యూనిట్లకంటే మంచి ఆదాయం వచ్చే మరో యూనిట్‌ను కూడా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో లబ్ధిదారుల సర్వేకు ముందే ఏ ప్రాంతంలో ఎలాంటి వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందనే విషయంలో వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కువగా ఉన్న వ్యాపారాలకు భిన్నమైన వాటిని ఎంపిక చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బదిలీ
ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న ఉమామహేశ్వర శర్మను ప్రభుత్వం బదిలీ చేసింది. దళిత బంధు పథకం అమలులో ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో అనుభవజ్ఞుడైన అధికారికి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందు లో భాగంగానే ఉమామహేశ్వర శర్మ బదిలీ అయినట్లు తెలుస్తున్నది. అయితే ఆయన స్థానంలో వరంగల్ రూరల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న డీ సురేశ్‌కు పోస్టింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండలంపై కూడా ఇతనికి పట్టు ఉన్నది. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ ఇస్తే ఇక్కడి నాలుగు మండలాల్లో కూడా సురేశ్ సమర్థవంతంగా పనిచేయగలుగుతారని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
‘దళితబంధు’కు మరో 200 కోట్లు : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
దళితబంధు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి కోట్లు విడుదల చేసిందని, మంగళవారం మరో 200 కోట్లు విడుదల చేసినట్లు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటి వరకు మూడు విడుతల్లో 1,200 కోట్లు ఇచ్చిందని, ఈ నిధులు కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని చెప్పారు. తెలంగాణ దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు అన్ని బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఐదు మండలాల్లోని దళితవాడల్లో ప్రతి ఇంటికీ వెళ్లి తెలంగాణ దళితబంధు బ్యాంక్ అకౌంట్ తెరువాలని సూచించారు. హుజూరాబాద్, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంటలోని దళిత వాడలకు వెళ్లి బ్యాంకు ఖాతాలు తెరువాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు. సమావేశంలో పాల్గొన్న బ్యాంకర్లు తెలంగాణ దళితబంధు ఖాతాలు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, నాబార్డ్ డీడీఎం అనంత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, అన్ని బ్యాంకుల కంట్రోలర్స్ పాల్గొన్నారు.