కరీంనగర్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పలువురు రాష్ట్ర ఎంపీలు సోమవారం న్యూఢిల్లీలో సమావేశమై రాష్ట్ర రోడ్ల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందులో భాగంగా కరీంనగర్- వేములవాడ- సిరిసిల్ల- కామారెడ్డి- పిట్లం రోడ్డును భారత్ మాల జాబితాలోకి చేర్చి త్వరలోనే జాతీయ రహదారిగా ప్రకటిస్తామని, నిధులు మంజూరు చేస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వినోద్‌కుమార్ తెలిపారు. ఈ రోడ్డు డీపీఆర్‌ను సిద్ధం చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కరీంనగర్- చల్లూర్- టేకుమట్ల- భూపాలపల్లి రోడ్డును త్వరలోనే పూర్తి స్థాయిలో జాతీయ రహదారిగా గుర్తిస్తామని నితిన్ గడ్కరీ ప్రకటించినట్లుగా వెల్లడించారు. దీనిపై వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తాను ఎంపీగా ఉన్న నాటి నుంచి ఈ అంశాలపై తీవ్రంగా కృషి చేస్తున్నానని తెలిపారు.