రామడుగు, ఆగస్టు 30: రామడుగు మండలం గోపాల్రావుపేట బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న టీఆర్ఎస్ జెండా గద్దెను సోమవారం మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, స్థానిక సర్పంచ్ కర్ర సత్యప్రసన్న కూల్చివేయడంతో పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నేపథ్యంలో గ్రామంలో బస్టాండ్ వద్ద జెండా గద్దెను తిరిగి నిర్మిస్తున్నారు. సత్యప్రసన్న ఉదయం 10 గంటలకు పంచాయతీ సిబ్బందితో అక్కడి చేరుకొని జెండా గద్దెను కూల్చేశారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఎస్ఐ తాండ్ర వివేక్ గోపాల్‌రావుపేటకు చేరుకొని టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి సముదాయించారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్పార్టీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జెండా గద్దెను తిరిగి నిర్మించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇదే విషయమై ఎస్ఐ స్పందన కోరగా శాంతిభద్రతలను కాపాడేందుకు సర్పంచ్ సత్యప్రసన్నను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కౌన్సెలింగ్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు చెప్పారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, కొండగట్టు దేవస్థానం ట్రస్టుబోర్డు డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు పైండ్ల శ్రీనివాస్, కట్కూరి మల్లేశః, మచ్చ గంగయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ, నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎడవెల్లి పాపిరెడ్డి, నేరెళ్ల అంజయ్య, పూడూరి మల్లేశం, నర్సింబాబు, జవ్వాజి శేఖర్, దాసరి అరుణ్‌కుమార్, రేండ్ల మల్లేశం, గునుకొండ అశోక్, జుట్ట లచ్చయ్య, జంకె రాంచంద్రారెడ్డి, కొలిపాక మల్లేశం, ఎలిగేటి మహేశ్, దుర్శేటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.