హుజూరాబాద్/ కమలాపూర్రూరల్, అక్టోబర్ 12: కారు జోరుమీదున్నది. టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నది. రోజురోజుకూ పెరుగుతున్న మద్దతు.. సర్కారు పనితీరు, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి తరలివస్తున్న నేతలతో పార్టీ బలం పెరుగుతున్నది. మంగళవారం హుజూరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సీపీఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పొనగంటి సహా 300 మంది నాయకులు, బీజేపీ నాయకులు చేరిపోగా, కమలాపూర్ మండలం గూడూరులో శాలివాహనులను ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీది పూటకో మాట..గడియకో వేషం: మంత్రి హరీశ్
బీజేపీ నేతలు ఓట్ల కోసం పూటకో మాట, గడియకో వేషం వేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సీపీఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పొనగంటి శ్రావణ్‌కుమార్‌తో సహా పలు మండలాలకు చెందిన దాదాపు 300మంది సీపీఐ కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ నేత రాజేందర్ సానుభూతి మాటలు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి గురించి ఊసెత్తడం లేదన్నారు. హుజూరాబాద్‌లో అరాచకానికి, అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతున్నదని, గెల్లు శ్రీనివాస్ పనిచేసే సత్తా ఉన్న నాయకుడు అన్నారు. రాజేందర్ మాట్లాడే మాటల్లో ఒక నీతివంతమైన మాట ఉందా..? అని ప్రశ్నించారు. గ్యాస్, సిలిండర్ విషయంలో రూ.291 రాష్ట్ర వాటా ఉందని ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడని ఒకవేళ ఆ మొత్తం రాష్ట్ర పన్ను ఉంటే తాను ముకు నేలకు రాస్తా… లేదంటే ముక్కు నేలకు రాస్తావా..? అంటూ ఈటలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో దగ్గు శ్రీనివాసరావు, రాంపెల్లి సతీశ్, మోతె అశోక్, రమేశ్‌రెడ్డి, రావుల రవి, వడ్లూరి ప్రసాద్, 300మంది సీపీఐ కార్యకర్తలున్నారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, జేఏసీ నాయకులు వంగల హన్మంత్‌గౌడ్, ఎర్రం పాపిరెడ్డి తదితరులున్నారు.
పథకాలకు ఆకర్షితుడినయ్యే..
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరిన. పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తా. గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ఊరు, వాడా తిరుగుతా. అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమవుతుంది. నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నా.
గెల్లుకు 50వేల మెజార్టీతో ఖాయం..
ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ 40వేల నుంచి 50వేల మెజార్టీతో గెలుసుడు ఖాయం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈటల రాజేందర్ తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నడు. మంత్రిగా పని చేసిన ఈటల ఎందుకు హుందాతనంగా మాట్లాడడం లేదో అర్థం కావడం లేదు. ఢిల్లీ రాజకీయాలు మనకు అవసరం లేదు. బీజేపీతో ఒరిగేది ఏమి లేదు.
గడపగడపకూ సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే చల్లా
రాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనియాడారు. మంగళవారం కమలాపూర్ మండలం గూడూరులో ట్రాక్టర్ యజమానుల సంఘం, శాలివాహన సంఘం నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాలివాహన సంఘం నాయకులు టీఆర్ఎస్కు జైకొట్టారు. పార్టీలో చేరారు. అనంతరం అంబాల గ్రామానికి చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ టీఆర్ఎస్లో వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి ఏం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు రావాలంటే గెల్లు శ్రీనివాస్‌కు మాత్రమే సాధ్యమని ఉద్ఘాటించారు.