జమ్మికుంట, ఆగస్టు 24: ‘ఇదిగో మీ గెల్లు శ్రీనివాస్ యాదవ్. మీ గరీబు మట్టి బిడ్డ. రెండే గుంటలున్నోడు. రూ.వేల కోట్ల అధిపతితో పోటీ పడుతున్నడు. రేపటి భవిష్యత్ నాయకుడు.. విద్యావంతుడు.. 130 కేసులున్న ఉద్యమకారుడు.. ప్రజల స్థితిగతులు మార్చుతున్న సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపించిన ఈ ఉద్యమనేతను గెలిపించడం మన బాధ్యత.. మీ తలలో నాలుకైతడు.. మీ సమస్యలను పరిష్కరిస్తుడు.’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట పట్టణంలో రాధాకృష్ణ మినీ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా హుజూరాబాద్ నియోజకవర్గం గంగపుత్రులు మంగళవారం ఆశీర్వాద సభ నిర్వహించారు. గంగపుత్ర నాయకుడు టంగుటూరి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు మంత్రితో పాటు రామగుండం, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ చిన్నోడని మాట్లాడుతున్నారని, అయితే 2004లో ఈటల రాజేందర్ ఇంతకంటే చిన్నవాడనే సంగతి మరిచిపోవద్దన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్న ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. బీజేపీ గ్యాస్, ఇంధనం ధరలు పెంచిందని, ధాన్యం కొనద్దని అంటున్నదని, ఇప్పుడు దేశంలోని ప్రభుత్వ సంస్థలను అమ్మేందుకు ప్రణాళికా తయారు చేసిందని, అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలను కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఫలం అందుకున్న వారు మత్స్యకారులేనని, గంగపుత్రుల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించారు. కాళేశ్వరంతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయని, అందులో ఉచితంగా పోసిన చేపలతో ఉపాధి పొందుతున్న విషయాలను గుర్తుచేశారు. ప్రస్తుతం గంగపుత్రుల జీవితాలు గొప్పగా ఎదిగాయని, మరింత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
మీ బిడ్డగా ఆశీర్వదించండి