శంకరపట్నం, సెప్టెంబర్ 7: మండల వ్యాప్తంగా సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. 175.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి తోడు ఎగువన సైదాపూర్‌లో కురిసిన భారీ వర్షాలు తోడవడంతో కేశవపట్నం వాగు ఉధృతంగా ప్రవహించింది. వరద నీరు పోటెత్తడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులన్నీ భారీగా మత్తడి దుంకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఆముదాలపల్లి-వీణవంక రోడ్ డ్యాంపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముత్తారం రామసముద్రం చెరువు నుంచి మత్తడి వరద పోటెత్తడంతో అర్కండ్ల-కన్నాపూర్ దారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే పాపయ్యపల్లి-కేశవపట్నం కల్వర్టుపై వరద నీరు పొంగడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఆముదాలపల్లి, కన్నాపూర్, మొలంగూర్, కేశవపట్నం, తదితర గ్రామాల్లో ఇండ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్‌రావు, ఎస్ఐ ప్రవీణ్‌రాజు ఆముదాలపల్లి, కేశవపట్నం, అర్కండ్ల, తాడికల్, వంకాయగూడెం, తదితర గ్రామాల్లో వరద వల్ల తలెత్తిన ఇబ్బందులను పరిశీలించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మత్తడి దుంకుతున్న చెరువులు
మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి గుండ్లపల్లి దేవుని చెరువు, గునుకుల కొండాపూర్‌లోని పటేల్ చెరువు, జంగపెల్లి ఊర చెరువు, పారువెల్ల, గన్నేరువరం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. రోడ్లపై వరద ప్రవాహంతో గుండ్లపల్లి, జంగపెల్లి, గన్నేరువరం నుంచి వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. వరద గన్నేరువరం చెరువు మత్తడి వద్ద వరద ఉధృతిని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఎవరూ వరదనీటిలో రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని రెవెన్యూ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు స్థానికులకు సూచించారు.
నీటమునిగిన పంటలు
మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. చెరువులు, కుంటలు నిండు కుండను తలపిస్తున్నాయి. మానకొండూర్, దేవంపల్లి ఊర చెరువులతో పాటు శ్రీనివాస్‌నగర్‌లోని బర్లాం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మానకొండూర్ నుంచి ముంజంపల్లి మీదుగా తిమ్మాపూర్‌కు వెళ్లే మట్టి రోడ్డు వరదనీటిలో పూర్తిగా కొట్టుకుపోయింది.
భారీ వర్షాలకు పొలాల్లో నీరు చేరుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గొల్లపల్లి-నేదునూరు రహదారితోపాటు పొరండ్ల-తిమ్మాపూర్ రోడ్డుపై నీరు నిలవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూ, వ్యవసాయాధికారులు గ్రామాల్లో వర్షంతో కలిగిన నష్టం వివరాలు సేకరిస్తున్నారు.
నిలిచిన రాకపోకలు
భారీ వర్షాలకు ఇందుర్తి- కోహెడ రహదారి వంతెనపై ఎల్లమ్మవాగు ఉధృతంగా ప్రవహించడంతో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. రామంచలో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో పంటలు నీటమునిగాయి. మండలంలోని పలు గ్రామాల్లో పాత ఇండ్లను తహసీల్దార్ ముబీన్‌అహ్మద్, ఆర్ఐ శ్రీనివాస్ పరిశీలించారు.