విద్యానగర్, సెప్టెంబర్ 7 :జీవన శైలిలో మార్పులకుతోడు కొత్త ఆహారపు అలవాట్లు, తగ్గుతున్న శారీరక శ్రమ, పెరుగుతున్న ఊబకాయం అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. నరాలు, కీళ్లు, కండరాలు, మోకాళ్ల్లు, వెన్నెముక సమస్యలతో బాధ పడుతున్నవారికి కాళ్లు, చేతులు పని చేయకపోవడంతో పక్షవాతం బారిన పడుతున్నారు. వీటన్నింటికి సాధారణంగా అందించే వైద్యంతో పాటు భౌతిక చికిత్స (ఫిజియోథెరపీ) ఈ రోజుల్లో తప్పనిసరైంది. ఒకప్పుడు ప్రైవేట్‌లోనే లభించే ఈ చికిత్స ఇపుడు ప్రభుత్వ దవాఖానాల్లోనూ అందుబాటులో ఉంది. నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
భౌతిక చికిత్సనే ఫిజియోథెరపీ..
కాంతి, ధ్వని తరంగాలు పలు పరికరాలు, విద్యుత్‌ను ఉపయోగించి వాటి ద్వారా వచ్చే వేడితో అందించే చికిత్స విధానాన్ని ఫిజియోథెరపీ (భౌతిక చికిత్స) అంటారు. ప్రత్యేకంగా రూపొందించిన సైకిళ్లు, పరికరాలను ఈ చికిత్సకు ఉపయోగిస్తారు. నడవలేని స్థితిలో ఉన్నవారికి, పక్షవాతంతో కాళ్లు, చేతులు దెబ్బతిన్న వారికి పలు రకాల థెరపీ చికిత్సను ఉపయోగిస్తారు. వెన్నుపూస, కండరాలు, మెడ, మోకాళ్లు, కీళ్లు, ఇతర సమస్యలతో బాధపడేవారు, ప్రమాదంలో గాయపడి దెబ్బతిన్న వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చి పూర్తిగా నయం చేయడంలో ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటి వద్దనే శారీరక శ్రమ కలిగేలా వైద్యులు సూచనలు చేస్తున్నారు. దవాఖానకు రాలేని వారికి ఇంటికే వెళ్లి చికిత్స అందిస్తున్నారు.
ఫిజియోథెరపీకి పెరుగుతున్న ప్రాధాన్యత
వెన్నుపూస దెబ్బ తినడం, రక్తపోటుపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది పక్షవాతం బారిన పడుతున్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వీటికి తోడు పుట్టుకతో వచ్చే అంగ వైకల్యం, ఇతర వైక్యలాలను నిర్లక్ష్యం చేయడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. సాధారణ స్థితికి రావడానికి ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీ చికిత్సకు ఇంతకుముందు కంటే ప్రాధాన్యత పెరిగింది. అందుకనుగుణంగా ప్రభుత్వం వైద్యులను నియమించాలి.
రోజురోజుకూ విస్తరిస్తున్న సేవలు..
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా రోజురోజుకూ ఫిజియోథెరపీ అవసరం పెరుగుతున్నది. ఈ చికిత్సకు ఆదరణ పెరగడంతో ఉమ్మడి జిల్లాలో 50 మందికిపైగా ఫిజియోథెరపిస్టులుగా స్థిరపడ్డారు. ఈ తరహా చికిత్సతో అనేక రుగ్మతలు తొలగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానల్లోనూ ఫిజియోథెరపీని అందుబాటులోకి తెచ్చారు. వెల్నెస్ సెంటర్లు, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, రెడ్‌క్రాస్ సొసైటీల్లో ఇపుడు నిరుపేదలకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు.