జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 10: ఈటల ధ్యాసంతా ఆస్తులు సంపాదించుకోవడం మీదేనని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. జమ్మికుంట పట్టణంలోని 12,15,16,21,22, 23,24,25,29,30వ వార్డుల్లో ఆదివారం ప్రచారం చేశారు. స్థానిక ఐబీపీ పెట్రోల్ పంపు నుంచి రోడ్ షో, ర్యాలీ తీశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల గెల్లు మాట్లాడారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఈటల ఏనాడూ పట్టించుకోలేదని, వారికి సేవ చేసే ఆలోచనే మర్చిపోయిండని విమర్శించారు. మనకు ఒక్కిల్లు కూడా కట్టియ్యలేని ఆయన మళ్లోసారి అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టియ్యాలని సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి అందిస్తే, మంత్రిగా ఉన్న ఈటల ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేని అసమర్థుడని దుయ్యబట్టారు. మంత్రిగా ఉండి పనిచేయలేనోడు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తాడని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకుని పనిచేసేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలని విజ్ఞప్తి చేశా రు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించే బాధ్యత నేనే తీసుకుంటానని, స్థలం ఉన్న పేద కుటుంబానికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తామని తెలిపారు. ఇక్క డి పేద ప్రజల ఉచిత వైద్యం కోసం మెడికల్ కాలేజీ తెప్పించే ప్రయత్నం చేస్తానని, అభివృద్ధికి సీఎంకు దండం పట్టైనా సరే.. రూ.100 కోట్లు తెస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, ఆయా వార్డుల కౌన్సిలర్లు మోలుగు ప్రణీత, పాతకాల రమేశ్, కూతాడి రాజయ్య, జీ పూలమ్మ, పొనగంటి మల్లయ్య, బచ్చు మాధవి, రావికంటి రాజ్‌కుమార్, మద్ది లావణ్య,నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా..
జమ్మికుంట అభివృద్ధి కోసం ఈటల రాజేందర్ ఎన్నో హామీలిచ్చిండు. జమ్మికుంటకు మాస్టర్ ప్లాన్ తెస్తా అన్నడు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తా అన్నడు. జమ్మికుంట వ్యాపార రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా అన్నడు. రోడ్లు, మురికి కాల్వలు కట్టిస్తా అన్నడు. కానీ, ఒక్కటీ చేయాలె. అన్నీ హామీలు మరిచిపోయిండు. నన్ను గెలిపించండి. జమ్మికుంటను అభివృద్ధి చేస్త. ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.43 కోట్లు ఇచ్చిండు. నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్త. విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్ సెంటర్, అధునాతన లైబ్రరీని ఏర్పాటు చేస్త. ముఖ్యమంత్రితో మాట్లాడి జమ్మికుంటనే కాదు హుజూరాబాద్‌ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుత.
‘గెల్లు’కు జమ్మికుంట జేజేలు..
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆదివారం జమ్మికుంట జనం జేజేలు పలికారు. కులమతాలకతీతంగా గులాబీ జెండాలు చేతబూని గెల్లు శ్రీనుకు స్వాగతం పలికారు. ముఖ్యంగా మైనార్టీ మహిళలు, దళితులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. రోడ్డుపై బతుకమ్మలు, మహిళల కోలాటాలతో ర్యాలీ జన సందోహంగా సాగింది. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. వృద్ధులు ఆయనకెదురేగి ఆశీర్వదించారు. వాడలన్నీ తెలంగాణ నినాదాలతో మార్మోగాయి. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని ముక్తకంఠంతో ప్రతినబూనారు. గెల్లు సీను గెలుపు కోసం ఎన్నికలు పూర్తయ్యే వరకు కష్టపడుతామని చెప్పుకొచ్చారు. యువకులు సైతం పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఆయా కులాల వారు ర్యాలీలో తిరిగారు. టీఆర్ఎస్కు మద్దతు పలికారు. ఉదయం పదిన్నరకు మొదలైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగింది. సాయంత్రం తెలంగాణ చౌరస్తా వద్ద కళాకారుడు సాయిచంద్ ఆధ్వర్యంలో జరిగిన ధూంధాం కార్యక్రమం జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకాగా, కళాకారులు ఆటాపాటలతో అలరించారు.