కమలాపూర్ (పరకాల), ఆగస్టు 31: కమలాపూర్ మండల ప్రజలకు ఏం చేసిండని ఈటలకు ఓటు వేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి కమలాపూర్ మండలం శనిగరం, మాదన్నపేట, గూన్పర్తి, శ్రీరాములపల్లి, అంబాల, నేరెళ్ల లక్ష్మీపురం గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌కు ఎమ్మెల్యేగా, మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు అప్పగిస్తే ప్రజాసేవను విస్మరించి వ్యక్తిగతంగా లబ్ధి పొందాడని ఆరోపించారు. స్వలాభం కోసమే పార్టీ మారాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందేలా అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లను పెంచి దోచుకుంటుందని విమర్శించారు. ప్రజలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలన్నారు. సీఎం కేసీఆర్ రెండు గుంటల భూమి మాత్రమే ఉన్న ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం కల్పించారని, ఏకతాటిపై ఉండి లక్ష ఓట్ల మెజార్టీటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ర్టానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష
సీఎం కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. రానున్న 20 ఏండ్లు రాష్ర్టానికి కేసీఆర్ మాత్రమే సీఎంగా ఉంటారని, ఆయన పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. 2001నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న తనను గుర్తించిన కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఆదరించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఇంట్లో చిన్న కొడుకుగా ఉంటూ సేవ చేస్తానని చెప్పారు. సమావేశాల్లో ఆయా గ్రామాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిక
కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు మంగళవారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఇక్కడ రాపాక ప్రశాంత్(కిట్టు), రాపాక కల్యాణ్, రాపాక ప్రశాంత్ తదితరులు ఉన్నారు.