తిమ్మాపూర్ రూరల్, మార్చి 15: ఉన్నత, విదేశీ చదువులు, ఉద్యోగాలు.. ఇలా ఎక్కడ చూసినా ప్రతి పనీ ఆంగ్లంతో ముడిపెట్టుకుపోతున్నది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేటుకు పంపించి ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరిక సన్నగిల్లింది. ఈ నేపథ్యంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాఠశాలల రూపురేఖలు మారి, పూర్వ వైభవం రాబోతున్నదని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాశాఖకే వెన్నెముక ఎల్ఎండీ స్కూల్..
ఎల్ఎండీలోని జిల్లా పరిషత్ పాఠశాల మండల విద్యాశాఖకే వెన్నెముకగా ఉండేది. 6 నుంచి 10 తరగతులు ఉన్న ఈ పాఠశాల పదేండ్ల క్రితం మూడు వందల పైచిలుకు విద్యార్థులతో కళకళలాడేది. జిల్లా స్థాయిలో విద్యాశాఖ పరంగా ఏ కార్యక్రమం జరిగినా.. ఇక్కడే నిర్వహించేవారు. పాఠశాలలో చదివిన వారెందరో అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు.
ప్రై‘వేటు’..
జిల్లాకు సమీపంలో ఉన్న తిమ్మాపూర్ మండలంలో ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు వెలువడంతో పాఠశాల ఉనికి కోల్పోయింది. క్రమంగా ఇంగ్లిష్ మీడియానికి విద్యార్థులు వెళ్లడంతో సంఖ్య విపరీతంగా పడిపోయింది. ప్రస్తుతం పాఠశాలలో 106 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. అందులో పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులే ఎక్కువ ఉన్నారు. మన ఊరు, మన బడి కార్యక్రమంతో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాలు సమకూరుతాయని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలు సక్సెస్ అవుతాయి.
రాష్ట్రప్రభుత్వం తీసుకువచ్చే మన ఊరు- మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ సక్సెస్ అవుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నప్పటికీ.. ఆంగ్ల మాధ్యమ ప్రభావంతో పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటుకు మొగ్గుచూతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి, వసతులు కల్పించనుండడంతో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుంది. ఆంగ్ల మాధ్యమంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలి.
-రాజభాను చంద్రప్రకాశ్, హెచ్ఎం, ఎల్ఎండీ.