కమాన్‌చౌరస్తా, ఆగస్టు 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. టీఎస్ ఎంసెట్ క్వాలిఫై , ఇంటర్లో ఓసీలు 45 శాతం, ఇతరులు 40 మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు http:/tseamcet.nic.inలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ సైట్ ఈ నెల 30 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇందులో నమోదు చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ 4 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీలు రూ. 600 ఆన్లైన్లో చెల్లించాలి. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసున్న నాలుగు సహాయ కేంద్రాల్లో ఏదేని ఒకటి ఎంపిక చేసుకుని తేదీ, సమయంతో స్లాట్ బుక్చేసుకోవాలి. ఆ తర్వాత అధికారులు తెలిపిన ధ్రువపత్రాలతో స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో సహాయ క్రేంద్రంలో హాజరు కావాలి.
ఆప్షన్ల విషయంలో జాగ్రత్త తప్పనిసరి..
ఎంసెట్ ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వెబ్ ఆప్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు విద్యార్థుల భవిష్యత్తుకే ఇబ్బంది కలిగించేలా మారుతాయి. ఇందులో మొదటి విడుత కౌన్సెలింగ్ చాలా కీలకం. మొదటి విడతలో మంచి కళాశాల ఎంపికలో తప్పు జరిగితే, రెండో విడుత కౌన్సెలింగ్ వచ్చేసరికి మంచి కళాశాలల్లో సీట్లు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకోసం మొదటగానే కళాశాల, ప్రాధాన్యతా క్రమం రాసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇందులో తమకు వచ్చిన ర్యాంకుకు గతేడాది కేటాయించిన కళాశాల, కోర్సు వివరాలు ఇంటర్నెట్ ద్వారా చూసుకుంటే ఆప్షన్ల ఎంపికలో సహాయంగా ఉంటుంది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండాలి. దీని ద్వారా కంప్యూటర్ ఆఫ్ అయినా, ఇంటర్ నెట్ సమస్య ఎదురయినా ఆప్షన్లు పెట్టుకున్నంత వరకు తొలగిపోకుండా ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రింట్ తీసుకుని, ఫాంను పీడీఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు.
కొత్త జిల్లాల వారీగా..
కరీంనగర్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల
రాజన్న సిరిసిల్ల : ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం
జగిత్యాల : ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జగిత్యాల
పెద్దపల్లి : యూనివర్సిటీ పీజీ కళాశాల, గోదావరిఖని
విద్యార్థులు స్టోర్ట్స్, క్యాప్, దివ్యాంగులు, ఎస్సీసీ, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక కేటగిరిలో అవకాశం ఉంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసాబ్‌ట్యాంకు, హైదరాబాద్‌లో హాజరు కావాల్సి ఉంటుంది.
లాగిన్ ఐడీ జాగ్రత్త..
విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు టీఎస్ ఎంసెట్ ద్వారా లాగిన్ ఐడీ వస్తుంది. లాగిన్ అయిన ప్రతిసారీ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చేంత వరకు వేచిచూసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరుసగా ఓటీపీలు వస్తే చివరగా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు..
ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్
సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు ధ్రుపత్రాల పరిశీలన
సెప్టెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు (కళాశాల, కోర్సు ఎంపిక) rసెప్టెంబర్ 15న తొలివిడుత సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేసి, బోధనా రుసుం చెల్లించాలి.
ఉమ్మడి జిల్లాలోని సహాయ కేంద్రాలు
ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లాకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తమ సమీప సహాయ కేంద్రంలో వారు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు ధ్రువపత్రాలు పరీశీలిస్తారు. ఈ క్రమంలో ప్రతి 30 నిమిషాలకు ఒక స్లాట్ ఉంటుంది. విద్యార్థి ఆన్లైన్లో సూచించిన సమయానికి సహాయ కేంద్రానికి రావాల్సి ఉంటుంది.
వెబ్ ఆప్షన్ల నమోదు..
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత విద్యార్థులు మాన్యువల్ ఆప్షన్ ఫాంలో తాము చదవాలనుకుంటున్న కళాశాల, కోర్సును ప్రాధాన్యతా క్రమంలో రాసుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు కేటాయించాలి. దీని కోసం ఇంట్లో కంప్యూటర్ ద్వారా, లేదా ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. అంతకు ముందు ఇంటర్నెట్ ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. సీట్ల కేటాయింపు ఆప్షన్ల ప్రాధాన్య క్రమంలోనే జరుగుతుంది. ఇది నాలుగు విడుతలుగా చేస్తారు.
కౌన్సెలింగ్ జరిగే విధానం
విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న సహాయ కేంద్రానికి 30 నిమిషాల ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. అధికారులు ఒరిజినల్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్ ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం విద్యార్థులు వెంట తీసుకెళ్లిన రెండు జిరాక్స్ సెట్లు అధికారులకు అప్పజెప్పి, మాన్యువల్ ఆప్షన్ ఫాం అడిగి తీసుకుని కౌన్సెలింగ్ హాల్ నుంచి బయటి రావచ్చు. ఈ సమయంలో విద్యార్థులు తమ మొబైల్ నంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నంబర్ కళాశాల్లో చేరే వరకు ఉంచుకోవాలి. అదే నంబర్‌కు టీఎస్ ఎంసెట్ నుంచి వచ్చే మెస్సేజ్‌లు, సమాచారం వస్తుంది.
తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు
తెలంగాణ ఎంసెట్ -2021 ర్యాంకు కార్డు, హాల్ టికెట్ ,ఇంటర్ మెమో
6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు ఇంటర్ టీసీ,కుల ధ్రువీకరణ పత్రం
ఆధాయ ధ్రువీకరణ ప్రతం (2021, జనవరి 1 తర్వాత ప్రభుత్వం జారీ చేసింది)
ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని వెళ్లాలి.