హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట, ఆగస్టు 31 : రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే దృఢసంకల్పంతో సీఎం కేసీఅర్ దళితబంధు ప్రవేశపెట్టారని, ఈ పథకం అమలుపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. మంగళవారం హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో సర్వేను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. జమ్మికుంట పట్టణంలోని 24వవార్డు గణేశ్నగర్ను సందర్శించి ఎస్సీలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. సిర్సపల్లిలో లబ్ధిదారులు ఏ యూనిట్ పెట్టుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు దళితులు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలుకు ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో ప్రభుత్వం రూ.2 వేల కోట్లు విడుదల చేసిందని, రానున్న రోజుల్లో రాష్ట్రమంతా అమలు చేయనున్నట్లు చెప్పారు. నాలుగు రోజులుగా సర్వే పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బులతో ఎటువంటి షాపు పెట్టుకోవాలి, ఏం వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏ పని చేస్తే ఆదాయం వస్తుందనే విషయాన్ని కుటుంబ సభ్యులంతా కూర్చొని ఒక నిర్ణయానికి రావాలన్నారు. జమ్మికుంటలో భాగ్య అనే మహిళ తాను ఎస్సీ కాగా, భర్త బీసీ అని, దళితబంధు వర్తిస్తుందా? అని అడుగగా.. మంత్రి స్పందిస్తూ ఏ కులంలో పుడితే అదే కులమే వర్తిస్తుందని, రూ.10 లక్షలు తప్పక వస్తాయని భరోసా ఇచ్చారు. ఎల్లవ్వ అనే మహిళ ట్రాలీ కొని నడుపుకుంటామని, దీప్తి అనే యువతి టైలర్ షాపు పెడ్తానని మంత్రి ప్రశ్నలకు బదులిచ్చారు. పెండ్లి చేసుకున్న కొడుకులను వేరే కుటుంబంగా భావించి ఈ పథకాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్, హుజూరాబాద్ తహసీల్దార్ రాంరెడ్డి, ఎంపీడీవో రమేశ్, సింగిల్ విండో చైర్మన్ కొండాల్‌రెడ్డి, సిర్సపల్లి సర్పంచ్ సువర్ణాల సునయానం, ఎంపీటీసీ రాధమ్మ ఉన్నారు.
కేసీఆర్‌తోనే పేదల బతుకుల్లో వెలుగులు
నేను 12 ఏండ్లుగా డప్పు కళాకారుడిగా పని చేస్తున్న. పని దొరకనపుడు హమాలీ పనికి పోత. ఎంత చేసినా కుటుంబ పోషణకు ఇబ్బందులేర్పడేవి. కేసీఆర్ సార్ మాలాం టోళ్ల జీవితాల్లో వెలుగులు నింపడానికి దళితబంధు తెచ్చిండు. మా కోసం ఇంత చేస్తున్న సార్‌ను ఎప్పటికీ మరువం. మేము టీఆర్ఎస్కు తప్ప ఏ పార్టీకి ఓటేయం.
-కొండ్ర రాజు, డప్పు కళాకారుడు,ఇందిరానగర్‌కాలనీ, హుజురాబాద్‌టౌన్
టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటం
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నిరుపేదలను ఇంత పెద్ద ఎత్తున ఆదుకుని అకున చేర్చుకున్న నాయకులు లేరు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలవారికి మేలు చేస్తున్నడు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటున్నడు. వచ్చే ఉప ఎన్నికల్లో మేమంతా టీఆర్ఎస్కు అండగ ఉంటం. పార్టీ అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించుకుంటం.
– గుండేటి నరేశ్, చిరువ్యాపారి,బీసీకాలనీ, ఇందిరానగర్, హుజూరాబాద్‌టౌన్.