వీణవంక, సెప్టెంబర్ 6: అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య పేర్కొన్నారు. దళితుల తలరాతను మార్చడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సోమవారం పలువురు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమ కావడంతో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. దళితులు అధికసంఖ్యలో తరలివచ్చి డప్పుచప్పుళ్ల మధ్య నృత్యం చేశారు. పటాకులు కాల్చి జై కేసీఆర్, జై తెలంగాణ, జై దళితబంధు అంటూ నినదించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు కనపర్తిలో ఇంటింటికీ తిరుగుతూ బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60శాతం దళితుల ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమ చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళితుల బతుకులు మారనున్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళితుల బతుకులు మారడానికి ఇది నాంది కావాలని, సంక్షేమ రాజ్యానికి తెలంగాణ చిరునామాగా మారిందని వివరించారు. అభినవ అంబేద్కర్గా సీఎం కేసీఆర్ దళితుల కోసం ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు వస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, రెక్కల కష్టం మీద ఆధారపడుతున్న వారి కోసం త్వరలో కొత్త పథకం తీసుకురానున్నట్లు వెల్లడించారు. దళిత వ్యతిరేక బీజేపీని ప్రజలు నమ్మవద్దని సూచించారు. తెలంగాణకు పైసా ఇవ్వని కేంద్రం పైగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సర్పంచ్ పోతుల నర్సయ్య, దళిత సంఘం నాయకులు అంబాల మధునయ్య, రాజయ్య, పోతుల సురేశ్, రాజయ్య, మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.