తెలంగాణచౌక్/ జమ్మికుంట రూరల్, జూన్ 17: త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన సైనికుల నియామకానికి కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. నాలుగేండ్ల త ర్వాత లక్షలాది మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం తమకొద్దంటూ పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. అన్ని వర్గాల ప్రజ లు, పార్టీల ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు నిరసనల్లో పాలుపంచుకున్నారు. ఈ స్కీంను వెంటనే రద్దుచేయాలని ముక్తకంఠం తో డిమాండ్ చేశారు. లేదంటే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సీపీఎం నగర అధ్యక్షుడు, సీపీఐ నగర కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగరపు రజనీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మణికంఠ శుక్రవారం వేర్వేరుగా నిరసనలకు దిగారు. ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటమాడుతున్నదని మం డిపడ్డారు. సైనికుల నియామకాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్డడం దేశభద్రతకు ప్రమాదకరమన్నారు. ఈ స్కీంను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జమ్మికుంటలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డె సమ్మయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాల్పుల్లో మరణించిన నిరసనకారుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు మాట్లాడుతూ.. సైనికుల ను తాత్కాలిక పద్ధతిలో నియమించడం సరికాదన్నారు. వెంటనే ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మోడీ ఇప్పుడు లక్షలాది మంది యువకులను నిరుద్యోగులుగా మార్చడం హాస్యాస్పదమన్నారు.